అన్ని పార్టీలకు కాంగ్రెసే దిక్కు?

August 20, 2018


img

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో అన్ని పార్టీలకు తల్లివంటిదని చెప్పవచ్చు. దేశంలో వివిదపార్టీల నేతలు కాంగ్రెస్‌ పాఠశాలలో రాజకీయ పాఠాలు నేర్చుకొని బయటకు వచ్చినవారే. కానీ కాంగ్రెస్ పార్టీ అవినీతికి, అసమర్ధతకు మారుపేరని అందరూ విమర్శలు గుప్పిస్తుంటారు. కాంగ్రెస్‌ కారణంగానే నేడు దేశం, రాష్ట్రం ఇటువంటి దుస్థితిలో ఉన్నాయని ఆరోపిస్తుంటారు. దేశం, రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిస్తుంటారు కూడా. కానీ మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలనే తమ పార్టీలోకి తెచ్చిపెట్టుకొంటుంటారు. కాంగ్రెస్ నేతలు అవినీతిపరులు, అసమర్ధులని వారిని తరిమికొట్టాలని వాదిస్తున్నప్పుడు మళ్ళీ వారినే పార్టీలో ఎందుకు తెచ్చుకొంటున్నారు? కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు అవినీతిపరులు, అసమర్ధులుగా ఉన్నవారు పార్టీ మారగానే నీతిమంతులు, సమర్ధులుగా మారిపోతారా? అనే ప్రశ్నలకు ఎవరూ సమాధానం చెప్పరు కానీ వారి సమక్షంలోనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పాలనను తిట్టిపోస్తుంటారు. 

గత ఎన్నికలలో ఏపీలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం కోసమే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి తన అన్న చిరంజీవిని కూడా ఎదురించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని వాదించారు. కానీ జనసేన కూడా అదే కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలను తెచ్చుకోక తప్పడం లేదు. 

తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పంతం నానాజీ తాను జనసేనలో చేరబోతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని తెలిసి ఉన్నప్పటికీ గత నాలుగేళ్లుగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్నానని, పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చడంతో జనసేన పార్టీలో చేరాలని నిశ్చయించుకొన్నానని చెప్పారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరతానని చెప్పారు.


Related Post