రెట్టింపు పెన్షన్లుసాధ్యమే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

August 18, 2018


img

టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా ప్రకటించిన ఎన్నికల హామీ ప్రస్తుతం ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు తదితరులకు ఇస్తున్న పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేయడం. అలాగే తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు.

 కానీ “ఈ హామీలను అమలుచేయడం ఆసాధ్యమని ముఖ్యమంత్రి కెసిఆర్ వాదిస్తున్నారు కదా?” అనే ప్రశ్నకు “మాపార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి నేతృత్వంలో వేసిన కమిటీ ఈ హామీలపై చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాతనే ఇది సాధ్యమని తేల్చి చెప్పి మా పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడానికి సిఫార్సు చేసింది. మా అంచనా ప్రకారం 10 లక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.3,000 చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించడానికి ప్రభుత్వానికి నెలకు రూ.300 కోట్లు భారం పడుతుంది. అలాగే పెన్షన్లు రెట్టింపు చేస్తే ఇంచుమించు అంతే భారం పడుతుంది. ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వ వార్షిక బడ్జెట్ లక్ష కోట్లు పైనే ఉంటోంది. దానిలో వీటి కోసం ఏడాదికి రూ. 7-10,000 కోట్లు కేటాయించడం పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నాము, అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  

అధికారంలో లేనప్పుడు ఎన్ని హామీలైనా ఈయవచ్చు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత అవే హామీలు గుదిబండలుగా మారి మెడకు చుట్టుకోవడం అందరూ చూస్తూనే ఉన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికలప్పుడు ఏవో హామీలు ఇచ్చేసి అధికారంలోకి వచ్చేక చేతులు దులుపుకొంటామంటే ఇప్పుడు కుదరదు. ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా అందరూ కలిసికట్టుగా నిలదీస్తున్నారు. కనుక కాంగ్రెస్‌ హామీలపై ఆ పార్టీ మరోసారి పునరాలోచించుకొంటే మంచిదేమో? 


Related Post