ముందస్తు ఎన్నికలకు టిఆర్ఎస్ కసరత్తు?

August 13, 2018


img

ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం 3 గంటకు తెలంగాణా భవన్ లో పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. సిఎం కెసిఆర్ ముందస్తుఎన్నికలకు వెళ్ళాలని భావిస్తున్నట్లు సంకేతాలు వెలువడుతున్న నేపధ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ముందస్తు ఎన్నికల కోసమే ఆయన వరుసగా పలు సంక్షేమ పధకాలను ప్రవేశపెడుతున్నారని, అందుకే రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను, మిషన్ భగీరధ వంటి అభివృద్ధి పనుల నిర్మాణ పనులను వేగవంతం చేయిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో రైతులందరికీ రూ.5 లక్షలకు జీవితాభీమా సర్టిఫికేట్లు అందజేసే ప్రక్రియ మొదలవుతుంది. పాడిరైతులకు పాడిపశువుల పంపిణీ ఇప్పటికే మొదలైంది. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు పేరుతో ఉచిత కంటివైద్య పరీక్షలు, అవసరమైనవారికి చికిత్సలు, కళ్ళజోళ్ళు సరఫరా చేసే కార్యక్రమం మొదలుపెట్టబోతోంది. ఆదేరోజు నుంచి రాష్ట్రంలో మెజారిటీ జనాభాగా ఉన్న బీసీలకు 100 శాతం రాయితీతో ఆర్ధికసహాయం అందించే మరో పధకం కూడా ప్రారంభించబోతోంది. దసరా పండుగ రోజు నుంచే మళ్ళీ రెండవ విడత పంట పెట్టుబడిసాయంగా రైతులకు చెక్కులు అందించబోతున్నట్లు సిఎం కెసిఆర్ ముందే ప్రకటించారు.   

కనుక ఈరోజు సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో టిఆర్ఎస్ నేతలకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం చేపట్టిన పధకాలు చేస్తున్న అభివృద్ధి పనుల గురించి వివరించి, వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేసుకొని ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలని కోరవచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ చేసుకొంటున్న ఎన్నికల సన్నాహల గురించి కూడా వారికి వివరించి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని కోరవచ్చు. సిఎం కెసిఆర్ ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరులోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టిఆర్ఎస్ హడావుడి చూస్తుంటే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నట్లే కనిపిస్తున్నాయి. ఒకవేళ నవంబరులోనే ముందస్తు ఎన్నికలకు వెళ్ళేమాటయితే, సెప్టెంబర్ నెలాఖరుకి లేదా అక్టోబరు మొదటివారంలో ప్రభుత్వం రద్ధుచేయవలసి ఉంటుంది. కనుక త్వరలోనే ముందస్తు ఎన్నికల గురించి స్పష్టతనీయవచ్చు.


Related Post