అటు భాజపా..ఇటు మజ్లిస్‌తో స్నేహం?

August 11, 2018


img

భాజపా, మజ్లిస్‌ పార్టీల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కారణాలు అందరికీ తెలుసు. కానీ సిఎం కేసీఆర్‌ ఒకే సమయంలో ఆ రెండు పార్టీలతో స్నేహసంబంధాలు నెరుపుతుండటం విశేషం. 

మజ్లీస్ అధినేతలు ఓవైసీ సోదరులతో కేసీఆర్‌, కేటీఆర్‌లకు మంచి అనుబంధం ఉంది. అలాగే ఓవైసీ సోదరులు కూడా వారితో స్నేహపూర్వకంగా ఉంటారు. శాసనసభ సమావేశాలలో మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సిఎం కేసీఆర్‌ను ఆయన ప్రభుత్వ పనితీరును పొగడకుండా ఉండరు. అలాగే ఓవైసీ సోదరులు చేసే ప్రతిపాదనలకు సిఎం కేసీఆర్‌ కూడా సానుకూలంగా స్పందిస్తుంటారు. 

ఇక ప్రధాని నరేంద్రమోడీ-కేసీఆర్‌ మద్య ఉన్న అనుబందాన్ని అందరూ చూస్తూనే ఉన్నారు. తమ స్నేహం కారణంగా తెలంగాణాలో భాజపా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ పట్టించుకోకుండా మోడీ కేసీఆర్‌తో తరచూ భేటీ అవుతున్నారు. అలాగే కేంద్రానికి అవసరమైనపుడల్లా తెరాస ఎంపిలు మద్దతు ఇచ్చి అండగా నిలబడుతుంటారు. 

అయితే భాజపాను, ప్రధాని నరేంద్రమోడీని తీవ్రంగా వ్యతిరేకించే ఓవైసీ సోదరులు మోడీ-కేసీఆర్‌ దోస్తీపై ఎన్నడూ నోరు విప్పి మాట్లాడలేదు. అంతమాత్రాన్న వారి స్నేహాన్ని అంగీకరిస్తున్నట్లు కాదు. కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని కేసీఆర్‌ చేసిన ప్రతిపాదనకు మజ్లీస్ పార్టీ వెంటనే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఫెడరల్ ఫ్రంట్ ప్రకటన చేసిన తరువాత కూడా దాని ఆశయానికి విరుద్దంగా కేసీఆర్‌ క్రమంగా మోడీకి దగ్గరవుతున్నారు. 

అయన ఒకపక్క తమతో కలిసి సాగుతూనే మరోపక్క తాము వ్యతిరేకించే మోడీకి  దగ్గరవుతుండటం ఓవైసీ నేతలలో అసహనం కలిగించడం సహజమే. సిఎం కేసీఆర్‌ ఎంత లౌకికవాది అయినప్పటికీ మోడీతో అంటకాగుతూ కేంద్రంలో మళ్ళీ భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారం దక్కించుకోవడానికి సహకరిస్తున్నప్పుడు, ఓవైసీ సోదరులకు తెరాసతో స్నేహం కొనసాగించవలసిన అవసరం లేదు. కనుక కేసీఆర్‌ ఇక ముందు కూడా మోడీవైపే మొగ్గు చూపినట్లయితే ఓవైసీ సోదరులు మళ్ళీ కాంగ్రెస్ పంచన చేరవచ్చు. మజ్లీస్ తనంతట తానుగా వస్తే కాంగ్రెస్ పార్టీ ఎగిరి గంతేయవచ్చు. మజ్లీస్ తో దోస్తీ వలన వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడవచ్చు. కనుక వచ్చే ఎన్నికలలో కేసీఆర్‌ భాజపా-మజ్లీస్ పార్టీలలో ఏదో ఒక దానిని వదులుకోక తప్పకపోవచ్చు.


Related Post