వైకాపా కుప్పి గంతులు

August 09, 2018


img

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో వైకాపా కుప్పిగంతులు వేసి నవ్వులపాలయింది. పార్లమెంటులో మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని తెదేపా నేతల నుంచి ఆరోపణలు ఎదుర్కొనడంతో, ఈ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఈయబోమని, ప్రతిపక్షాల అభ్యర్ధికే మద్దతు ఇస్తామని ప్రకటించింది. కానీ ప్రతిపక్షాల తరపున కాంగ్రెస్‌ ఎంపి హరి ప్రసాద్ ను అభ్యర్ధిగా ప్రకటించడంతో వైకాపా డైలామాలో పడింది. ఎందుకంటే, వచ్చే ఎన్నికలలో ఏపిలో వైకాపాకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్‌తో చేతులు కలపడానికి తెదేపా సిద్దం అవుతోంది. కాంగ్రెస్‌కు మరింత దగ్గరయ్యేందుకే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్ధికి తెదేపా మద్దతు పలికింది. కాంగ్రెస్‌, తెదేపాలు దగ్గరవుతున్నాయి కనుక కాంగ్రెస్‌ అభ్యర్ధికి మద్దతు ఈయకూడదని వైకాపా నిర్ణయించుకొంది. కానీ రెండు పార్టీలకు దూరంగా ఉండటానికి వేరే కారణం చెపుతోంది. కాంగ్రెస్‌, భాజపాలు రెండూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశాయని అందుకే ఆ రెండు పార్టీలలో దేనికీ మద్దతు ఇవ్వలేదని వైకాపా ఎంపి విజయ్ సాయి రెడ్డి చెప్పారు. 

ఎన్డీయేకు దగ్గరయితే ఏపిలో తెదేపా నేతల విమర్శల వలన పార్టీకి నష్టం జరుగుతుంది. కానీ వ్రతం చెడినా ఫలం దక్కనట్లు ఎన్డీయే అభ్యర్ధికి మద్దతు ఇవ్వకపోయినా ఏపిలో తెదేపా నేతలు వైకాపాను భాజపాతో ముడిపెట్టి విమర్శించకమానరు. పోనీ..ప్రతిపక్షాల అభ్యర్ధికి మద్దతు ఇద్దామంటే అయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి. కనుక ఏమి చేయాలో పాలుపోక ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉండిపోయింది.


Related Post