కాంగ్రెస్‌ వ్యూహం ఫలిస్తుందా?

August 09, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో..కొత్తగా అధికారంలోకి వచ్చిన తెరాస హైదరాబాద్‌ జంటనగరాలలో స్థిరపడిన ఆంధ్రా ప్రజల పట్ల, వారికి చెందిన సంస్థలపై, సినీ పరిశ్రమపై కక్షపూరితంగా వ్యవహరించి వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నప్పుడు తెలంగాణా కాంగ్రెస్‌ పార్టీ వారికి అండగా నిలబడింది. 

అయితే హైదరాబాద్‌ వంటి మహానగరంలో అని రాష్ట్రాలు, జిల్లాలవారు స్థిరపడటం సహజమేనని, రాష్ట్రాభివృద్ధిలో వారూ పాలుపంచుకొంటున్నారని గ్రహించిన తరువాత తెరాస సర్కార్ కూడా వారిపట్ల ద్వేషభావం వదిలించుకొని వారినీ సమానదృష్టితో చూడటం ఆరంభించింది. అందుకే తెదేపా, భాజపా, కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా చెప్పుకోబడే జి.హెచ్.ఎం.సి.పరిధిలో జరిగిన ఎన్నికలలో తెరాస విజయడంఖా మ్రోగించగలిగింది. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే.

అయితే మళ్ళీ ఎన్నికలు వస్తున్నందున గ్రేటర్ పరిధిలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లను ఆకట్టుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. ఆగస్ట్ 13,14 తేదీలలో రాహుల్ గాంధీ పర్యటన సందర్భంగా జంటనగరాలలో ఆంధ్రా ప్రజలు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాలలో సభలు, సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకొంటోంది. 

ఈ సందర్భంగా ఏపికి ప్రత్యేకహోదా డిమాండ్ కు పార్లమెంటులో కాంగ్రెస్‌ మద్దతు ప్రకటించడం, కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్‌ అధిష్టానం నిర్దిష్టంగా ప్రకటించిన విషయం గట్టిగా చెప్పుకొని ఆంధ్రా ప్రజలను ఆకట్టుకోవాలని కాంగ్రెస్‌ వ్యూహం. అదేవిధంగా ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వకుండా తెరాస ఏవిధంగా అడ్డుపడుతున్నదీ, భాజపా ఏవిధంగా మోసం చేసిందో వివరించి వారిని కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవాలని భావిస్తోంది.

కానీ ఏపి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎందుకు తిరస్కరించారో అందరికీ తెలుసు. కనుక నాలుగేళ్ళ తరువాత ఇప్పుడు ప్రత్యేకహోదా ఇస్తామనే హామీతో వారిని ప్రసన్నం చేసుకోగలదా? అంటే అనుమానమే. ఎందుకంటే, ప్రస్తుత పరిస్థితులలో కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వలేదని అందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్‌ ఇస్తామని చెపుతోంది. అంటే ఏపి ప్రజలను మభ్యపెట్టి వారి ఓట్లు సంపాదించుకోవడం కోసమేనని అర్ధం అవుతోంది. కనుక టి-కాంగ్రెస్‌ వ్యూహం ఫలించకపోవచ్చు. ఇంతకంటే హైదరాబాద్‌లో స్థిరపడిన వారి సమస్యల గురించి ప్రస్తావించి వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఏమైనా ఫలితం ఉంటుందేమో? 


Related Post