రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యలు

August 08, 2018


img

తెలంగాణా రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళు అయ్యింది. రైతుల కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేకానేక పధకాలు ప్రవేశపెడుతోంది. అనేకానేక అభివృద్ధి పనులు చేపట్టింది. పంట పెట్టుబడిగా ఎకరానికి రూ.4,000 చొప్పున రెండు పంటలకు కలిపి రూ.8,000 అందిస్తోంది. అనేక వేలకోట్లు ఖర్చుపెట్టి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నీటిని అందించడం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులలో పూడిక తీయించి నీటిని నింపుతోంది. ఆ కారణంగా భూగర్భజలాలు పెరిగాయి కనుక బోరు బావుల నుంచి అవసరమైన నీటిని తోడుకోవడానికి రైతులకు నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తోంది. గ్రామాలలో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొరత లేకుండా చేస్తోంది. రైతులకు సబ్సీడీపై ట్రాక్టర్లు అందిస్తోంది. వ్యవసాయ అధికారులను నియమించి రైతులకు అవసరమైన సహాయసహకారాలు అందేలా చేస్తోంది. రైతులు తమ ఉత్పత్తులను నిలువ చేసుకోవడానికి గిడ్డంగులు నిర్మిస్తోంది. ఇలాగ చెప్పుకొంటూపోతే రైతుల కోసం ప్రభుత్వం అమలుచేస్తున్న పధకాల జాబితా చాలా పెద్దదే ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో నేటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కారణాలు పాతవే. ఆర్ధిక సమస్యలు.

సోమ, మంగళవారం రెండు రోజులలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. ముగ్గురూ పత్తి రైతులే! ముగ్గురూ పత్తి పంట వేసి అది సరిగా పండకపోవడంతో దాని కోసం చేసిన అప్పులు తీర్చలేక, అప్పుల వాళ్ళ ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలు చేసుకొన్నారు.

వికారాబాద్ జిల్లా, నవాబ్ పెట్ మండలంలో కడిచర్లకు చెందిన పసుల మల్లయ్య (46) పత్తి పంట వేసి నష్టపోయాడు. రూ.5 లక్షలు అప్పులు ఉన్నాయి. అతనికి ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నాడు. పొలంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.

ఈరవెల్లి అశోక్ (32) ఆదిలాబాద్ జిల్లా, మండలం లాండసాంగ్వి గ్రామానికి చెందిన పత్తి రైతు. పత్తి పంటకు గులాబీ తెగులు సోకడంతో పంట పోయింది. దాని కోసం చేసిన అప్పులు ఏవిధంగా తీర్చాలో తెలియక ఆవేదనతో గులాబీ తెగలు నివారణకు తెచ్చిన పురుగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకొన్నాడు. 

నల్గొండ జిల్లా, చిట్యాల మండలంలోని వెల్మినేడుకు చెందిన గోలి లింగయ్య (36) తన మూడెకరాలతో పాటు మరో 8 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు కానీ పంట సరిగా రాకపోవడంతో దాని కోసం చేసిన రూ.8లక్షలు అప్పులు ఏవిధంగా తీర్చాలో తెలియక కుమిలిపోతూ ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. లింగయ్యకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. 

రైతుల సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతూ నిరాశా నిస్పృహలతో చివరికి ఆత్మహత్యలు చేసుకొంటుండటం చాలా బాధాకరం. రైతుల సమస్యలకు పరిష్కారం ఏమిటి? అది ఇంకా ఎప్పుడు లభిస్తుంది? అంతవరకు మన రైతన్నలను కాపాడుకోవడానికి ఏమి చేయాలి? అని అందరూ ఆలోచించి, వారి కోసం ఏదైనా చేసేందుకు ముందుకు వస్తే బాగుంటుంది. 


Related Post