కరుణానిధి ఇక లేరు

August 07, 2018


img

డిఎంకె అధినేత కరుణానిధి (94) మంగళవారం సాయంత్రం చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో కన్నుమూశారు. అయన మరణవార్తను కావేరీ ఆసుపత్రి అధికారికంగా ప్రకటించింది. అయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయన ఆరోగ్య పరిస్థితి నానాటికీ క్షీణిస్తుండటంతో జూలై 24వ తేదీన కావేరీ ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి వైద్యులు ఆయనకు చికిత్స చేస్తూనే ఉన్నారు. మద్యలో కాస్త కోల్కొన్నట్లు అనిపించినప్పటికీ, ఈరోజు ఉదయం నుంచి అయన పరిస్థితి విషమంగా మారి, సాయంత్రం తుది శ్వాస విడిచారు. 

కరుణానిధి మరణవార్త విని డిఎంకె నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు విషాదంలో మునిగిపోయారు. అయన మరణానికి సంతాప సూచకంగా తమిళనాడు ప్రభుత్వం బుధవారం శలవు ప్రకటించింది. ఏడు రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా తమిళనాడు రాష్ట్రమంతటా బారీగా పోలీసులను మొహరించారు. కరుణానిధి భౌతికకాయాన్ని కావేరీ ఆసుపత్రి నుంచి కొద్ది సేపటి క్రితమే బారీ బందోబస్తు నడుమ గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి రాజాజీ హాల్లో అభిమానుల సందర్శనార్థం కరుణానిధి పార్థీవదేహాన్ని ఉంచుతారు. రేపు మధ్యాహ్నం చెన్నైలో అయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. 

అయన అంత్యక్రియలకు తెలంగాణా, ఆంధ్రా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్‌, భాజపాలతో సహా దేశంలో వివిధ పార్టీల నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.

 


Related Post