అయితే కాంగ్రెస్‌ బూర్లో బుట్టలో పడినట్లే

August 07, 2018


img

కాంగ్రెస్‌, భాజపాలు కేంద్రంలో అధికారంలోకి రాగలుగుతున్నాయి కానీ ఎన్ని ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తమిళనాడులో మాత్రం అవి అధికారంలోకి రాలేకపోతున్నాయి. దశాబ్దాలుగా అక్కడ డిఎంకె లేదా అన్నాడిఎంకె పార్టీలదే అధికారం. వేరే పార్టీలకు అవకాశం లభించడం లేదు. కనుక ఎంత గొప్ప జాతీయ పార్టీలైన ఆ రెండు పార్టీలతో దేనితో ఒకదానితో తప్పనిసరిగా పొత్తులు పెట్టుకోకతప్పడం లేదు. 

ఒకవేళ అవి అందుకు అంగీకరించకపోతే విధిలేని పరిస్థితిలో వేరే పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి లేదా తెగించి ఒంటరి పోరాటం చేయకతప్పదు. గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ రెండు పార్టీలలో ఏదో ఒక దానితో పొత్తులు పెట్టుకోవాలని భాజపా విశ్వప్రయత్నం చేసింది. కానీ కుదరకపోవడంతో మోడీ, అమిత్ షాలు స్వయంగా ప్రచారం చేశారు. డిఎంకె, అన్నాడిఎంకె రెండూ అవినీతి పార్టీలని తిట్టిపోశారు. కానీ తమిళ ప్రజలు భాజపాను పట్టించుకోలేదు. కనుక డిపాజిట్లు కూడా దక్కలేదు. 

అప్పుడు అవినీతి పార్టీలని అన్న నోటితోనే మళ్ళీ ఇప్పుడు పొత్తుల కోసం అర్రులు చాస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. డిఎంకె అధినేత కరుణానిధి ఆసుపత్రిలో చేరగానే ఆయనను పరామర్శించడానికి కాంగ్రెస్‌, భాజపా నేతలు రెక్కలు కట్టుకొని వాలిపోవడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

ఇంతకీ విషయం ఏమిటంటే తమిళనాడులోని కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఒక గొప్ప ఆఫర్ లభించింది. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ‘మక్కల్‌ నీది మయ్యం’ అనే పార్టీ స్థాపించి రాజకీయాలలోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికలలో అయన కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయాలనుకొంటున్నారని తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ మీడియాకు తెలిపారు. 

తమిళనాడులో కమల్ హాసన్ కు చాలా ప్రజాధారణ ఉంది. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. కనుక డిఎంకె, అన్నాడిఎంకెలకు అయన పార్టీ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఆ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తులు పెట్టుకొంటే తమిళనాడులో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కనుక కాంగ్రెస్‌ తంతే బూర్లె బుట్టలో పడినట్లే ఉంది.


Related Post