ప్రొఫెసర్ కోదండరాం అరెస్ట్

August 06, 2018


img

తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి తమ పొలాలకు సాగునీటిని విడుదల చేయాలని గత పదిరోజులుగా ఆందోళన చేస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 24 గ్రామాలలో రైతులను కలిసేందుకు వెళుతున్న ఆయనను బిక్కనూరు టోల్ గేట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రైతుల ఆందోళనల నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఆర్మూర్ సబ్-డివిజన్ పరిధిలో నిన్నటి నుంచి పోలీసులు కర్ఫ్యూ  విధించారు. సెక్షన్ 144 అమలులో ఉన్న ప్రాంతానికి ఆయన వెళుతున్నారు కనుక అరెస్ట్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి తమ పొలాలకు సాగునీటిని విడుదల చేయాలని గత పదిరోజులుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. తక్షణం నీటిని విడుదల చేయకపోతే తమ పంటలు ఎండిపోతాయని, చాలా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ శ్రీరాంసాగర్ లో తగినంత నీటి నిలువలేదని, ఇప్పుడు పంటలకు నీరు అందించినట్లయితే మున్ముందు త్రాగేందుకు మంచినీళ్ళకు ఇబ్బంది పడవలసి వస్తుందని, కనుక ఎట్టిపరిస్థితులలో నీటిని విడుదల చేయలేమని అధికారులు స్పష్టం చేయడంతో 24 గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కళ్ళ ముందే పంటలు ఎండిపోతుంటే ఆవేదన చెందుతున్నారు. వారి సమస్యపై మంత్రి హరీష్ రావుతో కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించినట్లు సమాచారం. ప్రాజెక్టులో తగినంత నీటి నిలువలు లేకపోవడంతో అయన కూడా నీటి విడుదలకు ఆదేశాలు ఇవ్వలేకపోయారు. 

కనుక ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 24 గ్రామాలలో రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిస్థితులలో ప్రొఫెసర్ కోదండరాంను వారిని కలిసేందుకు అనుమతిస్తే, అయన తప్పకుండా వారిని మరింత రెచ్చగొట్టేవిధంగా మాట్లాడుతారనే ఉద్దేశ్యంతో పోలీసులు అయనను అరెస్ట్ చేశారు. సున్నితమైన ఈ సమస్యపై రాజకీయాలు చేయడం కంటే రైతుల సమస్యను ఏవిధంగా పరిష్కరించాలో సూచనలు, సలహాలు ఇస్తే బాగుంటుంది.   



Related Post