రిజర్వేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు లేవు కదా?

August 06, 2018


img

మరాటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉద్యమాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ఉపరితలరవాణామంత్రి నితిన్ గడ్కారీ స్పందిస్తూ, “వారు కోరినట్లుగా రిజర్వేషన్లు కల్పించామనే అనుకొందాం. కానీ ఉద్యోగాలు ఏవి? రిజర్వేషన్లతో ఉద్యోగాలు తప్పకుండా వస్తాయనుకొంటే పొరపాటే. ఎందుకంటే, ఐటి రంగం అభివృద్ధి చెందిన తరువాత బ్యాంకింగ్ తదితర రంగాలలో ఉద్యోగావకాశాలు బాగా తగ్గిపోయాయి. ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాల భర్తీ బాగా తగ్గిపోయింది. ఉద్యోగాలే లేనప్పుడు ఇక రిజర్వేషన్ల వలన ఏమి లాభం?ఈరోజుల్లో అన్ని కులాలవారు తాము సమాజంలో అందరికంటే వెనుకబడిపోయామని కనుక తమకు రిజర్వేషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. యూపి, బీహార్ తదితర రాష్ట్రాలలో బ్రాహ్మణ, క్షత్రియ తదితర ఉన్నత కులస్తులే నేటికీ పెత్తనం చలాయిస్తుంటారు. కానీ వారు కూడా తమకు రిజర్వేషన్లు కావాలని అడుగుతుంటారు. ఉద్యోగాలు కల్పించలేని రిజర్వేషన్లు ఎందుకు?” అని ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయనకు ధీటుగా సమాధానం ఇచ్చారు. “అవును ఉద్యోగాలు ఏవి? అని ప్రశ్నించి కనీసం ఇప్పటికైనా నిజం ఒప్పుకొన్నందుకు గడ్కరీకి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని ట్వీట్ చేశారు. 

తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశంలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామని నరేంద్ర మోడీ 2014 ఎన్నికల సమయంలో గొప్పగా ప్రచారం చేసుకొన్నారు. కానీ నాలుగేళ్ళు పూర్తయిపోయిన తరువాత, అయన మంత్రివర్గంలో సీనియర్ మంత్రి నితిన్ గడ్కారీ ఉద్యోగాలు లేవని చెపుతున్నారు. అంటే ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకిరావడానికే ఆనాడు కోటి ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ ఇచ్చారా?అని ప్రశ్నించవలసివస్తుంది. 

‘రిజర్వేషన్లు ఇచ్చినా ఉద్యోగాలు లేవు కదా?’ అంటే మరి రాజ్యాంగనిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఈ సంగతి తెలియకనే రిజర్వేషన్లు కల్పించారా? అని ప్రశ్నిస్తున్నట్లుంది. ఉద్యోగాలు కల్పన ప్రభుత్వం బాధ్యతే. ఆనాడు మోడీ చెప్పినట్లు కోటి ఉద్యోగాలు కల్పించి ఉండి ఉంటే దేశంలో బడుగుబలహీనవర్గాలకు ఆమేరకు ఉద్యోగాలు లభించిఉండేవి కదా?పాలకులు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి తెలివిగా మాట్లాడుతుంటారు. కానీ అంతమాత్రన్న వారి వైఫల్యాలను ప్రజలు గుర్తించలేరనుకొంటే అంతకంటే అవివేకం ఉండదు. 


Related Post