విన్నపాలు వినవలె మోడీగారూ..

August 04, 2018


img

సిఎం కేసీఆర్‌ శనివారం ప్రధాని నరేంద్రమోడీని కలిసి 11 హామీలపై వినతిపత్రాలు అందజేశారు. వారిరువురూ సుమారు 45నిమిషాల పాటు ఏకాంతంగా మాట్లాడుకొన్నారు. వారు రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుకోలేదని అనుకోలేము కానీ ఏమి మాట్లడుకొన్నారో తెలియదు. ఇక వినతి పత్రాల జాబితాలో, హైకోర్టు విభజన, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, వెనుకబడిని జిల్లాలు నిధుల విడుదల, కొత్త సచివాలయ నిర్మాణానికి రక్షణశాఖ అధీనంలో ఉన్న సికింద్రాబాద్‌లోని బైసన్ పోలో మైదానం కేటాయించాలని, గిరిజనులు, ముస్లిం, బీసిల రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలుపాలని, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఐఐఎం, కరీంనగర్‌లో ట్రిపుల్ ఐటి ఏర్పాటు, ఐటిఐఆర్ పధకం అమలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు రాష్ట్రపతి చేత ఆమోదముద్ర వగైరాలకు సంబంధించి వినతిపత్రాలు ఇచ్చినట్లు సమాచారం. 

అయితే వీటిలో ఒకటి రెండు మినహా మిగిలిన వాటి కోసం గత నాలుగేళ్ళుగా సిఎం కేసీఆర్‌ మోడీని కలిసినప్పుడల్లా గుర్తు చేస్తూనే ఉన్నారు. తెరాస ఎంపిలు వాటి కోసం పార్లమెంటులో అడుగుతూనే ఉన్నారు. ఆ తరువాత డిల్లీలో కేంద్రమంత్రులు, అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నారు. కానీ వాటిలో ఏ ఒక్కటీ అమలుచేయలేదు. అలాగని అమలుచేయబోమని కూడా చెప్పడం లేదు. హైకోర్టు విభజన, వెనుకబడిని జిల్లాలు నిధుల విడుదల వంటివి ప్రధాని మోడీ చేతిలో పనులే కానీ అవీ చేయలేకపోయారు. ఇక ముస్లిం రిజర్వేషన్ల అంశంపై కేంద్రం వైఖరి ఏమిటో కెసిఆర్ కు కూడా తెలుసు. కనుక దానికోసం వినతిపత్రం ఇచ్చి ప్రయోజనం ఉండదు. మరో ఏడెనిమిది నెలలు గడిపేస్తే ఎన్నికలు వచ్చేస్తాయి. అప్పుడు ఈ వినతిపత్రాలను పట్టించుకొనే తీరిక, ఆసక్తి, అవసరం ఉండదు కూడా.


Related Post