పొరుగువాళ్ళే ప్రాజెక్టులకు సహకరిస్తుంటే...

August 04, 2018


img

కాళేశ్వరంతో సహా రాష్ట్రంలో నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్‌, తెలంగాణా జనసమితి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణం అడ్డుకొనేందుకు కొందరు కాంగ్రెస్‌ నేతలు కోర్టులలో పిటిషన్లు వేయిస్తున్నారని తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆక్షేపిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టులను వ్యతిరేకిస్తుంటే ఎగువ రాష్ట్రమైన మహారాష్ట్ర తెలంగాణా ప్రభుత్వానికి అన్ని విధాల సహకరిస్తుండటం విశేషం. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్న బ్యారేజి కోసం మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలో కొంత భూసేకరణ చేయవలసి ఉంది. రెండు రాష్ట్రాలకు చెందిన అంతరాష్ట్ర బోర్డు సమన్వయ కమిటీ సభ్యులు దాని గురించి చర్చించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధ భవన్ లో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర తరపున చీఫ్ ఇంజనీర్ బి.ఎస్ స్వామి, ఎస్.ఈ.వేములకొండ, గడ్చిరోలి జిల్లా కలెక్టర్ శేఖర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 

మేడిగడ్డ, తమ్మడిహెట్టి వద్ద బ్యారేజిల నిర్మాణానికి తాము అన్ని విధాల సహకరిస్తామని వారు హామీ ఇచ్చారు. మహారాష్ట్ర భూభాగంలో 45 ఎకరాల భూసేకరణ కార్యక్రమం వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మేడిగడ్డ బ్యాక్ వాటర్స్, బ్యారేజి గేట్ల సంయుక్త నిర్వహణపై ఇరు రాష్ట్రాల ప్రతినిధులు చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణా అధికారులు మేడిగడ్డ బ్యారేజి యొక్క డిపిఆర్ మహారాష్ట్ర అధికారులకు అందజేశారు, తమ్మడిహెట్టి బ్యారేజి యొక్క డిపిఆర్ కూడా సిద్దంకాగానే అందజేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకొంటూ ముందుకు వెళ్లేందుకు తరచూ ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని రు రాష్ట్రాల నేతలు నిర్ణయించారు. 

కాళేశ్వరం ప్రాజెక్టు సీ.ఈ నల్లా వెంకటేశ్వరులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తెలంగాణా రాష్ట్రం తరపున ఈ.ఎన్.సి. నాగేంద్రరావు, ఎస్.ఈ. సుధాకర్ రెడ్డి, కార్యదర్శి అజయ్ కుమార్, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, ఆదిలాబాద్ జిల్లాలోని తమ్మిడిహెట్టి ప్రాజెక్టు సిఈ భగవంతరావు, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ తదితరులు హాజరయ్యారు.


Related Post