అందుకే ముందస్తు ఎన్నికలు?

August 04, 2018


img

కేంద్రప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించాలని ఆలోచిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికల గురించి ఆలోచిస్తుండటం విశేషం. అయితే ‘ముందస్తు’ అంటే ‘జమిలి ఎన్నికలే’నని తెరాస నేతలు వివరణ ఇస్తున్నప్పటికీ, లోక్ సభ ఎన్నికల కంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నందునే ఆ మాట అని ఉండవచ్చు. 

“తెరాస ప్రభుత్వానికి ఎటువంటి సమస్యలు లేనప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి?” అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ ప్రశ్నకు తెరాస ఇంతవరకు జవాబు చెప్పలేదు. కానీ ముందస్తు ఆలోచనలకు బలమైన కారణాలే కనిపిస్తున్నాయి. 

ఒకవేళ లోక్ సభ, శాసనసభ ఎన్నికలు కలిపి నిర్వహించినట్లయితే, అప్పుడు ఎన్నికలలో రాష్ట్రస్థాయి అంశాలను జాతీయాంశాలు డామినేట్ చేసే అవకాశం ఉంటుంది. దాని వలన జాతీయపార్టీలైన కాంగ్రెస్‌, భాజపాలకు ప్రయోజనం ఉంటుంది తప్ప తెరాసకుండదు. అదే...కేవలం శాసనసభ ఎన్నికలు ముందుగా నిర్వహిస్తే తెరాస సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర రాజకీయాలు, ప్రతిపక్షాల కుట్రలు వగైరాల గురించి తెరాస గట్టిగా చెప్పుకొని, కాంగ్రెస్, భాజపా తదితర ప్రతిపక్ష పార్టీలను అవలీలగా ఓడించవచ్చు.

అదీగాక జమిలి ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. ఇక మరోముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్రంలో 30-35 నియోజకవర్గాలలో ముస్లిం ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఒకవేళ జమిలి ఎన్నికలలో కాంగ్రెస్‌-భాజపాలు గట్టిగా పోటీపడితే ముస్లిం ఓటర్లు భాజపాపై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే అవకాశం ఉంది. అది తెరాసకు నష్టం కలిగిస్తుంది. కనుక శాసనసభ ఎన్నికలను వేరేగా జరిపించడమే తెరాసకు అన్ని విధాల మంచిదని తెరాస భావిస్తున్నట్లు సమాచారం. 

తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి రావాలని కోరుకొంటున్నారు కనుక తమకు మేలు కలుగుతుందనుకొంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళేందుకు ఏమాత్రం వెనుకాడకపోవచ్చు. అయినా వారికి తమ అధినేత సిఎం కేసీఆర్‌ రాజకీయ చతురత, వ్యూహలపై చాలా నమ్మకం ఉంది కనుక ఆయన ఏ నిర్ణయం తీసుకొన్నా వారు సమర్ధించవచ్చు. 

సిఎం కేసీఆర్‌ డిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం అయ్యి హైదరాబాద్‌ తిరిగి వచ్చిన తరువాత ముందస్తు గురించి ఏమైనా చెపుతారేమో చూద్దాం. 


Related Post