వాళ్ళిద్దరి సభ్యత్వం పునరుద్దరిస్తారా లేదా? హైకోర్టు

August 03, 2018


img

కాంగ్రెస్‌ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌ కుమార్‌ల శాసనసభ్యత్వాల పునరుద్దరణపై శుక్రవారం హైకోర్టు మళ్ళీ విచారణ చేపట్టింది. వారి శాసనసభ్యత్వాల పునరుద్దరించమని కోర్టు తీర్పును ఇంతవరకు ప్రభుత్వం ఎందుకు అమలుచేయలేదు? కారణం ఏమిటి? అసలు అమలు చేయాలనుకొంటోందా లేదా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ప్రభుత్వం తరపున వాదించిన నాయవాది ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి రెండు వారాలు సమయం కోరగా, న్యాయమూర్తి ఒక్క వారం మాత్రమే గడువు ఇచ్చారు. మళ్ళీ వాయిదాలో దీనికి సూటిగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. 

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనవసరమైన పంతానికి పోతున్నట్లు కనిపిస్తోంది. దీని వలన కాంగ్రెస్‌ నేతలకు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం కల్పించడమే కాకుండా ప్రతీ వాయిదాకి కోర్టులో మొట్టికాయలు వేయించుకోవలసివస్తోంది. ఇది ప్రభుత్వానికి అవమానకరమే తప్ప ప్రయోజనమేమీ కనబడటం లేదు. ఈ కధకు ప్రభుత్వం ఎటువంటి ముగింపు ఆశిస్తూ తాత్సారం చేస్తోందో?



Related Post