కేసీఆర్‌ వ్యూహంతో టి-భాజపా అయోమయం

August 03, 2018


img

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈరోజు డిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్రమోడీని కలువబోతున్నారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టబోయే కొత్త జోనల్ వ్యవస్థను అయన చేత ఆమోదింపజేసుకోవడానికి కలుస్తున్నారు. అవసరమైతే దీనికోసం 2-3 రోజులు డిల్లీలో ఉంటారని సమాచారం. 

వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇటువంటి పనుల మీద ప్రధాని మోడీని కలుస్తుండటం సాధారణమైన విషయమే. కానీ మోడీ-కేసీఆర్‌ వరుస భేటీలు వేరే సంకేతాలు పంపిస్తున్నాయి. మోడీ ప్రభుత్వానికి క్లిష్ట సమయాలలో తెరాస అండగా నిలబడుతున్న సంగతి అందరూ చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా కేంద్రం కూడా తెరాస సర్కార్ ప్రతిపాదనలపై వీలైనంత త్వరగా సానుకూలంగా స్పందిస్తుంటుంది. కనుక రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మోడీ-కేసీఆర్‌ మద్య స్నేహబంధం మంచిదేనని అర్ధం అవుతోంది. 

కానీ రాష్ట్ర భాజపా నేతలు తెరాస సర్కారు తీరు, సిఎం కేసీఆర్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిత్యం విమర్శలు, ఆరోపణలు చేస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర స్థాయిలో తెరాస-భాజపాలు రాజకీయంగా శత్రువులుగా వ్యవహరిస్తూ కేంద్రస్థాయిలో ఆప్తమిత్రులుగా వ్యవహరిస్తుండటమే విచిత్రంగా ఉంది.

ఈ భేటీల వలన రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతున్న మాట వాస్తవం. కానీ సిఎం కేసీఆర్‌ క్రమంగా ప్రధాని మోడీకి తద్వారా ఎన్డీయేకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా? అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటు మోడీకి దగ్గరవుతూనే ఇదే కారణం చేత రాష్ట్రంలో భాజపా నేతలు నోరు కట్టేసుకోవలసిన పరిస్థితి కల్పిస్తున్నారని చెప్పవచ్చు. కేసీఆర్‌-మోడీ సాన్నిహిత్యం కారణంగా రాష్ట్రంలో భాజపాను ప్రజలు నమ్మలేని పరిస్థితిని కల్పించడం ద్వారా దానిని రాజకీయంగా దెబ్బ తీస్తున్నట్లే భావించవచ్చు. రాష్ట్ర భాజపాను పల్లెత్తు మాటనకుండా మోడీ, కేంద్రమంత్రులతో స్నేహం ద్వారా దాని చుట్టూ గిరిగీసి నిలబెట్టడం గొప్ప రాజకీయ చతురతే అని చెప్పవచ్చు.


Related Post