ఏపిలో నిరుద్యోగ భృతి పధకం షురూ

August 02, 2018


img

ఏపిలో నిరుద్యోగులకు సెప్టెంబర్ నుంచి నెలకు రూ.1,000 చొప్పున నిరుద్యోగ భృతిని ఇవ్వబోతున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులు అందరికీ ఈ నిరుద్యోగ భృతిని అందించబోతున్నామని చెప్పారు. ‘ముఖ్యమంత్రి -యువనేస్తం’ పేరిట ప్రవేశ పెడుతున్న ఈ పధకంలో ఆగస్ట్ నెలాఖరువరకు ఆన్-లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి, అర్హులైన నిరుద్యోగులకు సెప్టెంబర్ 15వ తేదీలోగా నిరుద్యోగ భృతిని వారి బ్యాంక్ ఖాతాలలో జామా చేస్తామని చెప్పారు. 

ఒక ఇంట్లో ఎంత మంది నిరుద్యోగులుంటే అంతమందికీ నిరుద్యోగ భృతిని అందిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు సర్వేలు తెలుపుతున్నాయని, వారిలో అర్హులందరికీ నిరుద్యోగ భృతిని అందజేయడానికి ప్రభుత్వంపై నెలకు రూ.600 కోట్లు ఆర్దికభారం పడుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకొంటున్నామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. నిరుద్యోగులకు ఆర్ధికంగా సహాయపడటమే కాకుండా వారు ఉద్యోగం లేదా ఉపాధి సంపాదించుకొనేందుకు నైపుణ్య శిక్షణ కూడా ఇస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు. 

చదువులు సాగుతున్నంత కాలం యువత ఎటువంటి చింతలు లేకుండా హాయిగా గడిపేస్తారు. కానీ చదువులు పూర్తయినప్పటి నుంచి వారి జీవితంలో క్లిష్టమైన దశ మొదలవుతుంది. అదృష్టం బాగుంది వెంటనే ఏదో ఒక ఉద్యోగం దొరికేస్తే మంచిదే లేకుంటే రోజువారి ఖర్చుల కోసం తల్లితండ్రులపై ఆధారపడవలసి వస్తుంది. చివరికి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫీజులు, ఇంటర్వ్యూలకు వెళ్లి రావడానికి ఖర్చులకు కూడా తల్లితండ్రులపైనే ఆధారపడవలసి వస్తుంది. ఇది వారిలో ఆత్మనూన్యతను పెంచుతుంటుంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం అందించబోయే ఈ కొద్దిపాటి సొమ్ము వారికి ఎంతో విలువైనదనే చెప్పవచ్చు. 

ఈ నిరుద్యోగ భృతిని పొందేందుకు కొన్ని నిబందనలున్నాయి. 

1. దీనికి వయో పరిమితి 22 నుంచి 35 ఏళ్ళు వయసు.

2. ఏదైనా డిగ్రీ లేదా పాలిటెక్నిక్ కోర్సు చేసినవారు మాత్రమే అర్హులు.

3. ఆధార్, బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా కలిగి ఉండాలి. 



Related Post