రాహుల్ తెలంగాణా పర్యటన ఖరారు

August 02, 2018


img

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణా పర్యటన షెడ్యూల్ ఖరారయింది. ఆయన ఆగస్ట్ 13,14 తేదీలలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. మొదటిరోజున రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేస్తారు. ఆ తరువాత వారితో కలిసి రంగారెడ్డి జిల్లాలో బస్సు యాత్ర చేస్తారు. 

రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలలో అనైఖ్యత, టికెట్లు, పదవుల కోసం కీచులాటలు లేకపోయుంటే తెలంగాణా కాంగ్రెస్‌ చాలా బలంగానే ఉంటుంది. వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో తెరాసకు గట్టి పోటీ ఇవ్వగలదు. కానీ కాంగ్రెస్‌ నేతలు తమ బలహీనతల నుంచి బయటపడలేకపోతున్నారు. పార్టీలో సీనియర్లు సైతం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొంటున్నారు. 

ఉదాహరణకు పార్టీలో సీనియర్ నేత డికె అరుణ...జైపాల్ రెడ్డిపై కతులు దూస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్య విభేదాలున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, రేవంత్ రెడ్డికి మధ్య సరైన అవగాహన లేదు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ గెలిస్తే నల్గొండ జిల్లాకు చెందిన నేతే ముఖ్యమంత్రి అవుతారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటిస్తే, తెలంగాణాకు తరువాత ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డేనని సర్వే సత్యనారాయణ చెపుతారు. పార్టీ అధిష్టానం ఇంకా ఎన్నికలకు అభ్యర్ధుల పేర్లను ఖరారు చేయక మునుపే అజారుద్దీన్-అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్‌ స్థానం కోసం కీచులాడుకొంటున్నారు. 

అన్ని పార్టీలలో ఇటువంటి గొడవలు మామూలే కానీ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎవరికీ వారు తామే పెద్ద అని అనుకోవడం వలన, ఎవరూ ఎవరికీ జవాబుదారీ కాకపోవడం వలన ఇటువంటివి మరికాస్త ఎక్కువగా కనిపిస్తుంటాయి. కనుక రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలను చైతన్య పరిచే ముందు తమ పార్టీలో నెలకొన్న ఈ గొడవలకు అడ్డుకట్ట వేయగలిగితే అదే అయన పార్టీకి చేసే గొప్ప మేలు అవుతుంది.


Related Post