కేసీఆర్‌ కుటుంబం జైలుకు వెళ్ళక తప్పదు: కోదండరాం

August 02, 2018


img

తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం సిఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “వచ్చే ఎన్నికల తరువాత ప్రభుత్వం మారితే కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చేయిస్తున్న పాలకులు (కేసీఆర్‌, మంత్రి హరీష్ రావు) జైలుకు వెళ్ళక తప్పదు. ఆ ప్రాజెక్టు మెయిన్ కాంట్రాక్టర్ వద్ద నుంచి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు కమీషన్లు తీసుకొంటున్నారని నేను స్పష్టంగా చెపుతున్నాను. అందుకోసమే తుమ్మిడిహెట్టి వద్ద నీళ్ళు ఉన్నప్పటికీ ఆ ప్రాజెక్టు డిజైన్లు మార్పించి మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మిస్తున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్ళు లేవని నిరూపించమని నేను పాలకులకు సవాలు విసురుతున్నాను. అంతర్జాతీయ నిపుణులను పిలిపించి అక్కడ ప్రాజెక్టుకు అవసరమైన నీళ్ళు ఉన్నాయో లేవో పరిశీలింపజేయాలని డిమాండ్ చేస్తున్నాను. తుమ్మిడిహెట్టి నుంచి నీళ్ళు తీసుకొనేవిధంగా ప్రాజెక్టు నిర్మించి ఉండి ఉంటే రూ.40,000 కోట్లు ఆదా అయ్యుండేది. కానీ తెరాస పాలకులు కమీషన్లకు ఆశపడి మేడిగడ్డ వద్ద నిర్మిస్తున్నారు. అదికూడా అవసరానికి మించిన సామర్ధ్యంతో నిర్మిస్తున్నారు. దీని వలన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకు మేలు కలుగుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు కాదు. నేను నా ఆరోపణలకు కట్టుబడి ఉన్నాను. ఇవి ఆరోపణలు కాదు చేదు నిజాలు,” అని అన్నారు.

ప్రొఫెసర్ కోదండరాం ఇదివరకు ఎన్నడూ సిఎం కెసిఆర్ కుటుంబ సభ్యులపై నేరుగా ఇంత తీవ్ర ఆరోపణలు చేయలేదు. ఇప్పుడు అయన చేసిన ఆరోపణలపై తెరాస ఏవిధంగా స్పందిస్తుందో ఊహించవచ్చు. బహుశః నేడో రేపో స్పందించవచ్చు. 


Related Post