రాష్ట్ర ఐటి మంత్రి కేటీఆర్ బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించినప్పుడు విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా, “ఫెడరల్ ఫ్రంట్ అటకెక్కిపోయిందని మీరు ఎందుకు అనుకొంటున్నారు?” అని ఎదురు ప్రశ్నించారు. కానీ జాతీయస్థాయిలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను చూస్తే, వచ్చే ఎన్నికలలోగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదనే అర్ధమవుతోంది.
భాజపాతో కలిసి నడిచే పార్టీలలో రెండో మూడో వేరుపడిన మాట వాస్తవం కానీ మిగిలిన పార్టీలన్నీ నేటికీ దానితోనే ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్‌తో కలిసి సాగే పార్టీలు కూడా ఉన్నాయి. అవికాక కాంగ్రెస్‌తో కొత్తగా జతకట్టడానికి వస్తున్న పార్టీల సంఖ్యా కూడా పెరుగుతోంది. అందుకు ప్రధాన కారణం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని ప్రతిపక్షాలకు అప్పగించేందుకు సిద్దపడటమే.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్ల కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉండటంతో ఆమె చాలా ఉత్సాహంగా భాజపాను వ్యతిరేకిస్తున్న పార్టీలను అన్నిటినీ ఏకం చేసేపనిలో పడ్డారు.
ఈ సందర్భంగా ఆమె డిల్లీలో ఉన్నప్పుడు మీడియా ప్రతినిధులు “వచ్చే ఎన్నికల తరువాత మీరు ప్రధానమంత్రి పదవి చేప్పట్టాలని అనుకొంటున్నారా?” అని ప్రశ్నించగా, ఆమె ‘అవును.. కాదు’ అని సమాధానం చెప్పకుండా “ముందు భాజపాను ఓడించనివ్వండి..ఆ తరువాత అందరం కూర్చొని మాట్లాడుకొంటాము,” అని అన్నారు. అంటే ప్రధానమంత్రి పదవిపై ఆమెకు ఆశలు ఉన్నట్లు భావించవచ్చు.
ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవాలంటే ముందుగా భాజపాను వ్యతిరేకిస్తున్న తెదేపా వంటి పార్టీలను ఏకం చేయాలి. అందుకోసమే ఆమె ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఆమె డిల్లీలో వివిధ పార్టీల నేతలను కలుస్తూ తాను స్థాపించబోయే ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలని ఆహ్వానిస్తున్నారు. ఏపి సిఎం చంద్రబాబు నాయుడును కూడా ఆహ్వానించినట్లు తాజా సమాచారం. ఆమె సిఎం కేసీఆర్‌ను కూడా ఆహ్వానించబోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే ఆ ఫెడరల్ ఫ్రంట్ లో తెరాస చేరకపోవచ్చు. అంతేకాదు..ఆమె ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లయితే కేసీఆర్ తన ఫెడరల్ ఫ్రంటును తాత్కాలికంగానైనా అటకెక్కించక తప్పదు.