మేము గేట్లు తెరిస్తే కాంగ్రెస్‌ ఖాళీ: కేటీఆర్

August 01, 2018


img

రాష్ట్రంలో కాంగ్రెస్‌, తెరాస నేతల మద్య సవాళ్ళు ప్రతిసవాళ్ళలో నిజానిజాల మాట ఎలా ఉన్నప్పటికీ అవి ప్రజలకు మంచి వినోదం పంచిపెడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే వరకు గెడ్డం గీసుకోనని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రతిజ్ఞ చేస్తే, ఆ లెక్కన అయన ఇక జీవితంలో ఎన్నటికీ గెడ్డం గీసుకోలేరని కేటీఆర్ పంచ్ విసిరారు. కానీ ఒకవేళ వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ మళ్ళీ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలాగూ రాజకీయ సన్యాసం చేస్తారు కనుక అప్పుడు హాయిగా గెడ్డం గీయించుకొనే అవకాశం కూడా ఉంది.  

వచ్చే ఎన్నికలలో తెరాస 100 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరితే, కాంగ్రెస్‌ అధికారంలోకి రాకపోతే మేము రాజకీయ సన్యాసం చేస్తామని పలువురు కాంగ్రెస్‌ నేతలు ప్రతిసవాలు విసిరారు. తెరాసలో చాలామంది నేతలు, ఎమ్మెల్యేలు తమతో టచ్చులో ఉన్నారని సమయం వచ్చినప్పుడు, వారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెపితే, తెరాస గేట్లు తెరిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి మినహా మిగిలిన కాంగ్రెస్‌ నేతలందరూ తెరాసలో చేరిపోవడానికి సిద్దంగా ఉన్నారని మంత్రి కేటీఆర్ జవాబిచ్చారు. అయితే తెరాసలో ఇప్పటికే ‘హౌస్ ఫుల్’ అయిపోయినందున, కాంగ్రెస్‌ నేతలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నా ఎవరినీ పార్టీలోకి తీసుకోలేకపోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ నుంచి తెరాసలోకి ఎవరూ రారు... త్వరలోనే తెరాస నుంచే కాంగ్రెస్‌లోకి అనేకమంది వచ్చే అవకాశం ఉందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెరాసలో టికెట్లు లభించవని అనుమానిస్తున్న నేతలు కాంగ్రెస్‌లోకి వచ్చేయబోతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 

కాంగ్రెస్, తెరాసలు రెండూ ఎప్పుడో ‘హౌస్ ఫుల్’ అయిపోయాయని చెప్పవచ్చు. ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి టికెట్లు సర్ధలేక ఇప్పటికే ఆ రెండు పార్టీలు తలపట్టుకొంటున్నాయి. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారు సైతం అప్పుడే టికెట్ల కోసం కీచులాడుకొంటున్నారు. కనుక రెండు పార్టీలు కొత్తగా ఎవరినీ ఆహ్వానించి టికెట్లు ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. కొత్తవారిని చేర్చుకొంటే కొత్త తలనొప్పులను కొని తెచ్చుకోవడమే అవుతుందని వారికీ తెలుసు. కానీ ప్రత్యర్ధి పార్టీ నుంచి ఎంతమంది నేతలను పార్టీలోకి రప్పించగలిగితే అంత గొప్ప అన్నట్లు మాట్లాడుతుండటం విశేషం.


Related Post