ఆ విషయంలో రాజకీయ చతురత, అనుభవానిదే గెలుపు

July 31, 2018


img

తెలంగాణాలో గిరిజనులు, ముస్లింలకు, ఏపిలో కాపులకు రిజర్వేషన్ల అంశంపై తెలంగాణా, ఏపి ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు నాయుడు ఇద్దరూ చాలా లౌక్యంగా వ్యవహరించారని చెప్పవచ్చు. ఇది కేంద్రం పరిధిలో ఉన్న అంశమని తెలిసి ఉన్నప్పటికీ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఆ వర్గపు ప్రజలకు హామీ ఇచ్చారు. రెండు రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ఆ అంశంపై నిలదీయడంతో అసెంబ్లీలో తీర్మానాలు చేసి డిల్లీకి పంపించేసి బంతిని మోడీ కోర్టులో పడేసి చేతులు దులుపుకొన్నారు. 

ఈవిషయంలో టి-కాంగ్రెస్‌ నేతలు మొదటి నుంచి కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు కనుక వారికి ఎటువంటి ఇబ్బంది కలుగలేదు. నిద్రలో కలవరించినట్లు అప్పుడప్పుడు షబ్బీర్ ఆలీ వంటి కాంగ్రెస్‌ నేతలు ‘ముస్లింలకు రిజర్వేషన్లు ఇంకా ఎప్పుడు పెంచుతారు?’అంటూ ప్రశ్నిస్తూ సిఎం కేసీఆర్‌పై నాలుగు విమర్శలు చేయడంతో సరిపెట్టుకొంటారు. కానీ కాపుల రిజర్వేషన్ల అంశంపై దూకుడుగా ప్రవర్తించి జగన్ బోర్లపడ్డారు. 

కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిన తెదేపాకు ఎటువంటి నష్టమూ జరుగలేదు కానీ కాపుల కోసం కొన్ని రోజులు పోరాడి ఇప్పుడు ‘ఇది కేంద్రం పరిధిలోని అంశం కనుక నేనేమీ చేయలేనని’ జగన్ మాట మార్చినందుకు వైకాపా పట్ల ఆ సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. 

సున్నితమైన రిజర్వేషన్ల అంశంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, తమ రాజకీయ చతురతను, కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ అనుభవాన్ని ప్రదర్శించగా ఆవేశపరుడైన జగన్ తొందరపాటుతో దూకుడుగా వ్యవహరించి కాపు సామాజికవర్గానికి శత్రువుగా మారారు.


Related Post