రిజర్వేషన్ల అంశంపై జగన్ యూ టర్న్!

July 31, 2018


img

రాష్ట్ర విభజన తరువాత ఏపిలో అభివృద్ధి జరుగుతుందనుకొంటే, కేవలం రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. గత ఎన్నికలలో తెదేపా అధికారంలోకి వస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెదేపా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చింది కానీ హామీని అమలుచేయకపోవడంతో కాపు నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. 

వైకాపా, సాక్షి మీడియా అయనకు సంపూర్ణమద్దతు ప్రకటించి బాసటగా నిలిచాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అవుతాడు కనుక తన శత్రువైన చంద్రబాబును వ్యతిరేకిస్తున్న ముద్రగడను మిత్రుడుగా భావించి సహకారం అందించి ఉండవచ్చు. నిజానికి జగన్ ప్రోద్భలంతోనే అయన ఉద్యమాన్ని ప్రారంభించారని తెదేపా వాదన. 

కాపులకు కంచుకోటగా పేర్కొనబడే తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అన్ని వర్గాలకు కలిపి 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలు లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. మరి అటువంటప్పుడు కాపులకు ఏవిధంగా రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం? ఇది కేంద్రం పరిధిలో ఉన్న అంశం కనుక దీనిపై నేను మీకు ఎటువంటి హామీని ఇవ్వలేనని నిర్భయంగా, బహిరంగంగా చెపుతున్నాను,” అని అన్నారు. ఏపి రాజకీయాలలో కలకలం సృష్టిస్తోందిప్పుడు. 

ఎన్నికలు దగ్గర పడుతున్నప్పుడు పార్టీకి తీవ్ర నష్టం కలిగించే ఈ ప్రకటన ఎందుకు చేశారు? దాని వెనుక కారణాలు ఏమిటి? దాని వలన వైకాపాకు లాభమా నష్టమా? అనే చర్చలు మొదలయ్యాయిప్పుడు. 

వాటి సంగతి పక్కనపెడితే, జగన్ ఇచ్చిన ఈ షాక్ తో ముద్రగడ పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదనే సంగతి జగన్ కు తెలియదనుకోలేము. మరి తెలిసే అప్పుడు ముద్రగడకు మద్దతు ఇచ్చి, ఇప్పుడు యూ టర్న్ తీసుకోవడంతో జగన్ కు ఓటు బ్యాంక్ రాజకీయాలపై ఉన్న శ్రద్ధ కాపులకు రిజర్వేషన్లు కల్పించడంపై లేదని అర్ధమవుతోంది.

కాపులకు రిజర్వేషన్ల అంశంపై పోరాడటం వలన పార్టీకి ఎటువంటి లాభమూ కలుగకపోవడంతో ఇప్పుడు ఏపిలో బిసిలను ప్రసన్నం చేసుకొనేందుకే ముద్రగడకు...కాపులకు జగన్ ‘బై’ చెప్పేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  కానీ ఈ యూ టర్న్ వలన జగన్ తన విశ్వసనీయతను తనే దెబ్బ తీసుకొన్నారు. అంతేకాదు..తనను విమర్శించేందుకు తెదేపా నేతలకు మంచి ఆయుధం కూడా ఆయనే అందించారు. ఇదివరకు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో యూ టర్న్ తీసుకొన్నట్లుగానే ఇప్పుడు సున్నితమైన ఈ అంశం కూడా జగన్ మళ్ళీ యూ టర్న్ తీసుకొన్నారు. వైకాపాపై దీని ప్రభావం ఏవిధంగా ఉండబోతోందో మున్ముందు తెలుస్తుంది.


Related Post