ఇంతకీ టి-కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరో?

July 31, 2018


img

తెలంగాణాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అవ్వాలని కనీసం ఒక అరడజను మంది ఆశపడుతున్నారు. కనుక ‘మీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు?’ అనే తెరాస ప్రశ్నకు టి-కాంగ్రెస్ నేతలు ఎవరూ సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. కానీ మాజీ ఎంపి సర్వే సత్యనారాయణ చెప్పేశారు. 

నిన్న బోడుప్పల్‌లో జరిగిన కాంగ్రెస్‌ సభలో మాట్లాడుతూ, “రాబోయే ఎన్నికలలో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం ఖాయం. వచ్చే ఏడాది బోనాల పండుగకు అయన ముఖ్యమంత్రి హోదాలో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకొని బోనం సమర్పిస్తారు. అయితే ఈ సందర్భంగా నేను మనవి చేసేదేమిటంటే, మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత మీకోసం పనిచేస్తున్న మా అందరినీ మరిచిపోవద్దు,” అని సర్వే సత్యనారాయణ అన్నారు.          

ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే సర్వే సత్యనారాయణ ఈ మాటలన్నారు. అప్పుడు అయన మొహం వెలిగిపోయింది. అది సహజం కూడా. అయితే పార్టీలో అరడజను మంది ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నప్పుడు ఈ మాటలకు అభ్యంతరాలు వ్యక్తం అవడం కూడా అంతే సహజం. 

సీనియర్ కాంగ్రెస్‌ నేత వి. హనుమంతరావు తక్షణమే స్పందిస్తూ, “ఇప్పుడు మనం అందరం ఆలోచించవలసింది ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలని కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఏవిధంగా గెలిపించుకోవాలని ఆలోచించాలి. కనుక సర్వే సత్యనారాయణ ఈవిధంగా మాట్లాడటం సరికాదు. పార్టీలో సీనియర్ నేతలు ఒక్కొక్కరూ ఒక్కో రకంగా మాట్లాడటం వలన పార్టీలో అయోమయం ఏర్పడుతుంది. పార్టీ బలహీనపడుతుంది. గత ఎన్నికలకు ముందు ఇదేవిధంగా పదవుల కోసం కీచులాడుకొని అధికారాన్ని చేజార్చుకొన్నాము. కనుక మళ్ళీ ఆ తప్పు చేయొద్దు. పార్టీలో అందరూ   కలిసికట్టుగా పనిచేసి పార్టీని గెలిపించుకొందాము. ఆ తరువాత ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో కాంగ్రెస్‌ అధిష్టానం, పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిర్ణయిస్తారు. ఈ విషయంలో అయనదే తుది నిర్ణయం,” అని అన్నారు.

ఒకపక్క తెరాస వచ్చే ఎన్నికలలో 100కు పైగా సీట్లు గెలుచుకొంటామని ఆత్మవిశ్వాసంతో చెపుతుంటే, అప్రమత్తం కావలసిన కాంగ్రెస్‌ నేతలు ఇంకా ఎన్నికలు రాకమునుపే, పార్టీ గెలవక ముందే ముఖ్యమంత్రి పదవి ఎవరు చేపట్టాలని కీచులాడుకొంటున్నారు. గత ఎన్నికలకు ముందు పదవుల కోసం కీచులాడుకొంటూ విజయావకాశాలను చేజార్చుకొన్నారు. కాంగ్రెస్‌ నేతల తీరు చూస్తుంటే చరిత్ర పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు పదవుల కోసం ఈ కీచులాటలు ఆపకపోతే వారికి పదవుల మీద ఉన్న ఆసక్తి రాష్ట్రాభివృద్ధి మీద లేదని ప్రజలు భావించే ప్రమాదం ఉంటుంది కనుక మళ్ళీ ఓటమి తప్పకపోవచ్చు.


Related Post