సంక్షేమ పధకాలు: కేరాఫ్ తెరాస సర్కార్!

July 31, 2018


img

తెరాస సర్కార్ ఈ నాలుగేళ్ళలో సగటున ప్రతీ 3-4 నెలలకు ఒక సంక్షేమ పధకం ప్రవేశపెడుతూనే ఉంది. ఆగస్ట్ 15 నుంచి రాష్ట్రంలో రైతులందరికీ జీవితభీమా, రాష్ట్రంలో ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షల నిర్వహణకు సిద్దం అవుతోంది. అదేరోజు నుంచి మరో సంక్షేమ పధకం అమలుచేయడానికి తెరాస సర్కార్ సిద్దం అవుతోంది. 

ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలలో మాత్రమే మధ్యాహ్నభోజనం పెడుతున్నారు. ఈ ఆగస్ట్ 15నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో విద్యార్ధులకు కూడా మధ్యాహ్నభోజనం అందించడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ‘అక్షయపాత్ర ఫౌండేషన్’ కు ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించింది. 

రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ ప్రధమ, ద్వితీయ సం.లు చదువుతున్న విద్యార్ధులు మొత్తం 1.80 లక్షలమంది ఉన్నారు. మోడల్ స్కూల్స్ జూనియర్ కాలేజీలలో మరో 23,000 మంది విద్యార్ధులు చదువుకొంటున్నారు. వీరందరికీ మంచిపోషక విలువలతో కూడిన మధాహ్నభోజనం అందించడానికి ఇంటర్మీడియేట్ బోర్డు అధికారులు అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు. అన్నీ అనుకొన్నట్లుగా జరిగితే ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో విద్యార్ధులకు మధ్యాహ్నభోజనం పధకం ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ 3వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం మళ్ళీ మరోమారు సమావేశమవుతోంది. ఆరోజు దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.


Related Post