ఈ కుమ్మకు రాజకీయాల లొల్లి ఏమిటో?

July 30, 2018


img

అక్కడ ఏపిలో..ఇక్కడ తెలంగాణాలో కుమ్మక్కు రాజకీయాల గోల ఎక్కువైపోయింది. అక్కడ ఏపిలో జగన్,పవన్ కేంద్రంతో కుమ్మక్కు అయ్యారని తెదేపా ఆరోపిస్తుంటే, బాబు-మోడీ మధ్య రహస్య అవగాహన ఉందని జగన్ ఆరోపిస్తుంటారు. చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలలో ఎవరు డిల్లీ వెళ్ళినా మోడీని ప్రసన్నం చేసుకోవడానికేనని పరస్పరం ఆరోపించుకొంటుంటారు. ఏపిలో నాలుగు పార్టీలు కలిసి నాలుగు స్థంభాలాటలు ఆడుతూ ప్రజలకు వినోదం పంచుతున్నాయి. 

తెలంగాణాలో కాంగ్రెస్‌, తెరాస, భాజపాలు ఇప్పుడు అదేపనిలో బిజీగా ఉన్నాయి. సిఎం కేసీఆర్‌కు మోడీతో రహస్య అవగాహన ఉందని అందుకే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో తెరాస సభ్యులు సభ నుంచి వెళ్ళిపోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెరాసకు ఓటు వేస్తే భాజపాకు ఓటు వేసినట్లేనని వాదిస్తున్నారు. 

కాంగ్రెస్‌ పార్టీ తెదేపాతో అర్రులు చాస్తోందని అందుకే అది ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతోందని, కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తోందని తెరాస వాదిస్తోంది. కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రాపాలకులకు తెలంగాణాలో కోవర్టులని తెరాస విమర్శిస్తోంది. తెలంగాణాకు సంబంధించినంత వరకు కాంగ్రెస్‌, భాజపాలు దొందూ దొందేనని వాటికి రాష్ట్రంపై ఏమాత్రం ఆసక్తిలేదని తెరాస వాదిస్తోంది. 

ఇక భాజపా వాదన మరోలా ఉంది. సిఎం కెసిఆర్ రాష్ట్రంలో ముస్లిం ఓట్లకు ఆశపడి మజ్లీస్ అధినేతలకు దాసోహం అయిపోయారని, కనుక తెరాసకు ఓటు వేస్తే మజ్లీస్ పార్టీకి వేసినట్లేనని వాదిస్తోంది. కాంగ్రెస్‌, తెరాసలు దొందూ దొందేనని వాదిస్తున్నారు రాష్ట్ర భాజపా నేతలు. 

ఈవిధంగా అన్ని పార్టీలు పరస్పరం నిందించుకొంటూ ప్రజలను గందరగోళానికి గురిచేయాలని చూస్తున్నప్పటికీ, ఏ పార్టీ తీరు ఏవిధంగా ఉందో, ఎవరెవరు శత్రువులో...ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎవరెవరు జిగిరీ దోస్తులో ప్రజలకు బాగానే తెలుసు. కనుక ఎన్నికలు వచ్చినప్పుడు వారు తమ తమ అభిప్రాయం ఖచ్చితంగా తెలియజేస్తారు. అంతవరకు ఎవరు ఎవరితోనైన కుమ్మక్కు కావచ్చు లేదా విమర్శించుకోవచ్చు. 


Related Post