తెదేపాతో దోస్తీ కోసమే...కర్నే ప్రభాకర్

July 30, 2018


img

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, తెరాస నేతల మధ్య మళ్ళీ మాటల యుద్ధం ప్రారంభం అయ్యింది. ఆ ప్రాజెక్టును రీ-డిజైన్ చేసి, దాని కోసం రూ.86,000 కోట్లు అప్పులు చేసి నిర్మిస్తున్నందున దాని కోసం తెచ్చిన అప్పులు..వాటిపై వడ్డీలకు, ఏటా ప్రాజెక్టు నిర్వహణకు అయ్యే ఖర్చుల వలన భవిష్యత్ లో రాష్ట్ర ప్రజలపై చాలా భారమే పడబోతోందని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. ఆ ప్రాజెక్టు వలన రాష్ట్రంలో రైతుల కంటే ఆంధ్రా కాంట్రాక్టర్లే ఎక్కువ లాభపడుతున్నారని ఆరోపించారు. 

కాంగ్రెస్‌ నేతలపై విమర్శలపై తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ చాలా ధీటుగా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, “గతంలో కాంగ్రెస్‌ హయంలో ప్రాజెక్టులను రీ-డిజైనింగ్ చేయలేదా? అప్పుడు తప్పుగా కనిపించనిది ఇప్పుడు ఎందుకు తప్పుగా కనిపిస్తోంది? తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉందని వాదిస్తున్న కాంగ్రెస్‌ నేతలు తమ ప్రభుత్వ హయంలో అక్కడ ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు? రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రా పాలకుల కోవర్టులులాగ వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో వారు తెదేపాతో పొత్తులు పెట్టుకోవాలని అర్రులు చాస్తున్నారు. అందుకే తెలంగాణా ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు.” అని విమర్శించారు. 

రాజకీయంగా బద్ధ శత్రువులైన కాంగ్రెస్‌- తెదేపాలు వచ్చే ఎన్నికలలో పొత్తులు పెట్టుకోవాలని ఆలోచిస్తున్నట్లు ఆ పార్టీల నేతలే చూచాయగా చెపుతున్నారు. కానీ తెదేపాతో పొత్తుల కోసం రాష్ట్ర కాంగ్రెస్‌ తెలంగాణాలో ప్రాజెక్టులను వ్యతిరేకించేంత తెలివితక్కువ పని ఎన్నటికీ చేయదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, తెదేపాతో పొత్తుల ఆలోచనలు రెండు మూడు నెలల క్రితం మొదలయ్యాయి కానీ ప్రాజెక్టులలో అవినీతి జరుగుతోందని రెండుమూడేళ్ల క్రితం నుంచే కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక తెదేపాతో పొత్తుల కోసం రాష్ట్రంలో ప్రాజెక్టులను వ్యతిరేకిస్తే తామే నష్టపోతామని వారికీ తెలుసు. 

ఇక మరో విశేషమేమిటంటే, సిఎం కెసిఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తుంటే, కాంగ్రెస్‌ నేతలు ఆంధ్రా పాలకులకు కోవర్టులుగా పని చేస్తున్నారని తెరాస నేతలు ఆరోపిస్తున్నారు. అంటే అధికార, ప్రతిపక్షాలు రెండింటిపై ఆంధ్రా ప్రభావం బలంగా ఉందనుకోవాలా?


Related Post