కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాల చర్చ

July 30, 2018


img

కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణా రాష్ట్రానికి లాభమా నష్టమా? అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌ ప్రెస్ క్లబ్బులో ప్రతిపక్షాలు, సాగునీటి రంగానికి చెందిన ఇంజనీర్లు, నిపుణులు చర్చించారు. దీనిపై తెలంగాణా జెఎసి చైర్మన్ రఘు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 

ఈ ప్రాజెక్టుతో 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తానని ప్రభుత్వం చెపుతున్న మాటలు నిజం కాదని, ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 9 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించడం సాధ్యం అవుతుందని రఘు వివరించారు. ప్రాజెక్టు నిర్వహణ (విద్యుత్ వినియోగం, పంపుల మరమత్తులు, ఉద్యోగుల జీతభత్యాలు), ప్రాజెక్టుపై తీసుకొన్న అప్పులు, వాటిపై వడ్డీలు అన్నీ కలుపుకొని ఏడాదికి రూ.17,876.70 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ లెక్కన 9 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళు అందించినట్లయితే ఎకరానికి ప్రాజెక్టు నిర్వహణకు అయ్యే ఖర్చు రూ.1.54 లక్షలని, ఒకవేళ ప్రభుత్వం చెపుతున్నట్లుగా36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం సాధ్యమనుకొంటే, ప్రాజెక్టు నిర్వహణ ఖర్చులు మరో నాలుగు రెట్లు పెరుతాయని రఘు వివరించారు. కనుక ఈ ప్రాజెక్టు భవిష్యత్ లో తెలంగాణాకు భారంగా మారవచ్చునని రఘు చెప్పారు. 

తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, “రాష్ట్ర ప్రభుత్వం రీ-డిజైనింగ్ పేరుతో ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని రూ.86,000 కోట్లు పెంచేసింది. ఈ ప్రాజెక్టుకు డిజైన్లు ఇంజనీర్లు, నిపుణులకు బదులు ఆంధ్రా కాంట్రాక్టర్లు రూపొందించినందునే ప్రాజెక్టు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. దీనిపై ప్రశ్నిస్తున్న మావంటివారిని అభివృద్ధి వ్యతిరేకులనే ముద్రవేసి ఎదురుదాడి చేస్తోంది తప్ప ఈ ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించుకోవడానికి ఇంజనీర్లు, నిపుణులు సూచిస్తున్న సలహాలను పట్టించుకోవడం లేదు,” అని అన్నారు.

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ ప్రాజెక్టు విషయంలో సిఎం కెసిఆర్ నిర్ణయాలు రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడవు కానీ ఆంధ్రా కాంట్రాక్టర్లకు  లబ్ది కలిగిస్తాయి. వారికోసమే ఆయన ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టును రీ-డిజైనింగ్ చేయించి, ఇదొక అద్భుతమైన ప్రాజెక్టని నమ్మబలుకుతున్నారు. 

తుమ్మిడిహెట్టి వద్ద 273 టి.ఎం.సిల నీటి లభ్యత ఉంటుందని గతంలో కేంద్ర జలవనరుల కమిటీ నిపుణులే నిర్ధారించారు. కానీ తెరాస సర్కార్ అక్కడ కాదని మేడిగడ్డ వద్ద ఎందుకు నిర్మిస్తోంది? అది ప్రజాధనం దుబారా చేయడం కాదా? గతంలో ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు రూ.36,000 కోట్లు అంచనా వేయగా సిఎం కెసిఆర్ రీ-డిజైనింగ్ పేరుతో దానిని రూ.86,000 కోట్లుకు పెంచేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేసరికి అది రెండు లక్షల కోట్లు చేరుకొన్నా ఆశ్చర్యం లేదు. భవిష్యత్తులో ఈ భారం అంతా తెలంగాణా ప్రజలపైనే పడబోతోంది,” అని అన్నారు.


Related Post