తెరాస సర్కారుకు హైకోర్టులో మళ్ళీ మొట్టికాయలు

July 28, 2018


img

సిఎం కెసిఆర్ రాజకీయ, పాలనావ్యవహారాలను ఎంత సమర్ధంగా నిర్వహిస్తున్నప్పటికీ, న్యాయ సంబంధిత వ్యవహారాలలో ఎదురుదెబ్బలు తప్పడంలేదు. తాజాగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల శాసనసభ్యత్వాల రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా కోర్టుధిక్కారానికి పాల్పడినందుకు ప్రభుత్వానికి మళ్ళీ నిన్న హైకోర్టులో గట్టిగా మొట్టికాయలు పడ్డాయి.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను పునరుద్దరించాలని హైకోర్టు న్యాయమూర్తి (సింగిల్ జడ్జి) జస్టిస్‌ బి.శివశంకర్‌రావు మూడు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఆదేశించారు. కానీ ఇంతవరకు ఆ ఆదేశాలు అమలుచేయకపోవడంతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మళ్ళీ హైకోర్టులో పిటిషను వేశారు. దానిపై శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్‌ బి.శివశంకర్‌రావు, ప్రభుత్వం తరపున వాదించిన అధనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కోర్టు ఆదేశాలను అమలుచేయకపోవడం కోర్టు ధిక్కారం కాదా? అని ప్రశ్నించారు. తమ ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి , న్యాయశాఖ కార్యదర్శి కానీ అమలుచేయకపోగా అది వారి పరిధిలోని అంశం కాదని వాదించడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ వారు కోర్టు ధిక్కారానికి పాల్పడలేదని భావిస్తే వారిద్దరికీ సమన్లు జారీ చేసి కోర్టుకు రప్పించి వారి బాధ్యతను తెలియజేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. తమ ఆదేశాలను ప్రభుత్వం అమలుచేస్తుందా లేదా? అనే విషయం ఆగస్ట్ 3వ తేదీ లోగా తెలియజేయాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

ఈ కేసులో మొట్టమొదట వాదించిన రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రకాష్ రెడ్డి, ఆ ఇద్దరు కాంగ్రెస్‌ సభ్యులు గవర్నర్ నరసింహన్ శాసనసభలో ప్రసంగిస్తున్నప్పుడు అనుచితంగా ప్రవర్తించారని, దానికి వీడియో ఫుటేజి సాక్ష్యం కూడా ఉందని దానిని కోర్టుకు సమర్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ కోర్టుకి వీడియో ఫుటేజిని సమర్పిస్తానని హామీ ఇచ్చినందుకు ప్రభుత్వం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అయన తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత ఈ కేసులో ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు వీడియో ఫుటేజిని సమర్పించకపోవడంతో కోర్టు వారిని నిలదీసింది కూడా. అయినా సమర్పించలేదు.

ఆ తరువాత కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాలను పునరుద్దరించాలని హైకోర్టు తీర్పు చెప్పినప్పుడు ప్రభుత్వం దానిని గౌరవించి ఉండి ఉంటే ఈ మొట్టికాయలు తప్పి ఉండేవి. కానీ వారి విషయంలో ప్రభుత్వం పంతానికి పోవడంతో ఈ అవమానకర పరిస్థితి ఎదుర్కోవలసివచ్చింది. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కోర్టు తీర్పును గౌరవిస్తే ఈ సమస్య నుంచి హుందాగా బయటపడవచ్చు. లేకుంటే దీనిపై సుప్రీంకోర్టు వరకు వెళ్ళవలసి రావచ్చు.

తెరాస సర్కార్ కు హైకోర్టులో పదేపదే మొట్టికాయలు పడుతుండటం గమనిస్తే, ప్రభుత్వానికి సరైన న్యాయసలహాలు లభించడం లేదా లేక ప్రభుత్వమే న్యాయనిపుణుల సలహాలను పట్టించుకోవడం లేదా అనే సందేహం కలుగుతోంది. 


Related Post