మమతక్క కేసీఆర్‌ని దెబ్బేసిందా?

July 28, 2018


img

సిఎం కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు గురించి ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని వెళ్ళి కలిసారు. కానీ ఆమె కేసీఆర్‌ ఫెడరల్ ఫ్రంట్ ను స్వంతం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారిపుడు. జూలై 31వ తేదీన కోల్ కతాలో ఆమె ఒక బారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. దేశంలో భాజపాను వ్యతిరేకిస్తున్న అన్ని ప్రతిపక్షపార్టీల అధినేతలను దానికి ఆహ్వానిస్తున్నారు. ఆ సభ ప్రధాన ఉద్దేశ్యం దేశంలో భాజపాయేతర పార్టీలను అన్నిటినీ కలుపుకొని ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం. వచ్చే ఎన్నికలలో అది కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేస్తుంది. మమతా బెనర్జీ దేశంలో అన్ని పార్టీలతోపాటు తెరాస అధినేత కేసీఆర్‌ను కూడా ఆ సభకు ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. కానీ తను ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను ఆమె ఎత్తుకుపోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయాలనుకోవడాన్ని కేసీఆర్‌ జీర్ణించుకోవడం కష్టమే కనుక అయన లేదా తెరాస తరపున మరెవరూ కానీ ఆ సభకు హాజరుకాకపోవచ్చు. 

మమతా బెనర్జీ చేస్తున్న ఈ ప్రయత్నం వలన కేసీఆర్‌ తన ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనను విరమించుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది కూడా. అయితే అందుకు ఆమెను నిందించనవసరం లేదు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో భుజాలు రాసుకొని తిరుగుతూనే ఉన్నారు. సిఎం కెసిఆర్ ఆమెను కలిసేందుకు కోల్ కతా వెళ్ళాలనుకొన్నపటికే ఆమె సోనియా, రాహుల్ గాంధీలను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకొన్నారు. కనుక అప్పుడే ఆమె తన వైఖరి ఏమిటో స్పష్టం చేశారు. కానీ కేసీఆర్‌ అది పట్టించుకోకుండా కోల్ కతా వెళ్లి ఆమెను కలవడమే ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఆమె ఇప్పుడు కాంగ్రెస్‌ తో కలిసి పనిచేసే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకోవడానికి చాలా బలమైన కారణమే ఉంది. వచ్చే ఎన్నికలలో మోడీ సర్కారును గద్దె దించడమే తమ లక్ష్యమని ప్రకటించిన కాంగ్రెస్‌ అధిష్టానం అందుకోసం అవసరమైతే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయడానికి సిద్దమని సంకేతం ఇచ్చింది. ఆ పదవిని మమతా బెనర్జీ లేదా మాయావతి ఇద్దరిలో ఎవరు చేపట్టినా తమకు అభ్యంతరం లేదని తెలిపింది. ఊహించని విధంగా వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతోనే మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు పూనుకొంటున్నారని చెప్పవచ్చు.


Related Post