గజం వంద రూపాయలే...ప్రజలకు కాదు

July 28, 2018


img

ఈరోజుల్లో సామాన్య ప్రజలు జీవితాంతం కష్టపడి డబ్బు కూడబెట్టినా స్థలం కొనుకొని స్వంత ఇల్లు కట్టుకొనే పరిస్థితి లేదు. ఎందుకంటే, భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మారుమూల గ్రామాలలో సైతం భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఏమారుమూల గ్రామంలోనైనా ఎకరం భూమి లక్షలు పలుకుతోంది. 

ఈ పరిస్థితులలో అన్ని జిల్లా కేంద్రాలలో తెరాస కార్యాలయాలు నిర్మించడానికి గజం రూ.100ల చొప్పున ఒక ఎకరం భూమి కేటాయించాలని నిన్న రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించడం విస్మయం కలిగిస్తుంది. తెరాసతో సహా గుర్తింపు పొందిన అన్ని పార్టీలకు కూడా ఇదే ధరలకు భూములు కేటాయించాలని నిర్ణయించింది. 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. దానిలో ప్రతీ జిల్లా కేంద్రంలో తెరాస కార్యాలయాల నిర్మాణాలకు ఒక్కో ఎకరం చొప్పున భూకేటాయింపు ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశారు. అదే కాదు..ప్రభుత్వం కేటాయించిన భూములలో నిర్మించబడిన పార్టీ కార్యాలయాలకు ఆస్తి పన్నును కూడా మినహాయించారు. 

ఆస్తి పన్ను చెల్లించకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకొంటామని మునిసిపల్ శాఖసిబ్బంది సామాన్య ప్రజలకు హెచ్చరికలు చేస్తుంటారు. కానీ ఆర్ధికంగా ఎంతో బలంగా ఉండే రాజకీయ పార్టీలకు లక్షలు విలువచేసే భూములను కేవలం వంద రూపాయల నామమాత్రపు ధరలకు కట్టబెట్టడం, పైగా ఆస్తిపన్నును కూడా మినహాయించవలసిన అవసరం ఏమిటో అర్ధం కాదు. 

తెరాస అధికారంలోకి వస్తే దళిత కుటుంబాలకు మూడు ఎకరాల చొప్పున వ్యవసాయభూమిని ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీని నిలుపుకోలేకపోయింది. కానీ తెరాస కార్యాలయాల కోసం 29 జిల్లాలలో కోట్లు విలువ చేసే 29 ఎకరాల భూమిని కేటాయించుకొంది. అధికారంలో ఉన్నవారు ప్రభుత్వ ఆస్తులకు ధర్మకర్తలుగా వ్యవహరిస్తూ వాటిని కాపాడేందుకు ప్రయత్నించాలి కానీ ఈవిధంగా అప్పనంగా తమ పార్టీకి తాము ప్రభుత్వ భూములు కేటాయించుకోవడం, ఆస్తిపన్ను మినహాయింపు ఇచ్చుకోవడాన్ని ప్రజలు హర్షించరని గ్రహిస్తే మంచిది.


Related Post