ఆ కేసుతో ఎవరికీ సంబంధము లేదుట!

July 27, 2018


img

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాల రద్దు, దానిపై కోర్టు తీర్పు అమలు చేయకపోవడానికి తెలంగాణా ప్రభుత్వంలో ఎవరూ బాధ్యులు కాకపోవడం విచిత్రం. వారిరువురి సభ్యత్వాలను పునరుద్దరించవలసిందిగా హైకోర్టు తీర్పు చెప్పి ఇప్పటికి మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కోర్టు తీర్పును అమలుచేయలేదు. అది కోర్టు ధిక్కారమేనని కాంగ్రెస్‌ నేతలు మరో పిటిషన్ దాఖలు చేశారు. దానిలో రాష్ట్ర న్యాయశాఖ, రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొనడంతో న్యాయస్థానం వారిరువురినీ సంజాయిషీ కోరుతూ నోటీసులు జారీ చేసింది. 

కోర్టుధిక్కారకేసులో న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్ రావు వేసిన కౌంటర్ పిటిషనులో, ఈ కేసుతో తనకు ఎటువంటి సబంధమూ లేదని స్పష్టం చేశారు. శాసనసభ తీసుకొనే నిర్ణయాలలో జోక్యం చేసుకొనే అధికారం కానీ, కోర్టు తీర్పును వారిచేత అమలు చేయించే అధికారం గానీ తనకు లేవని కనుక తాను కోర్టు ధిక్కారానికి పాల్పడలేదని తెలిపారు. 

ఇక అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు వేసిన కౌంటర్ పిటిషనులో కూడా ఇంచుమించుగా ఇదే చెప్పారు. శాసనసభ స్పీకర్ ఆదేశాల మేరకే తాను కాంగ్రెస్‌ శాసనసభ్యుల సభ్యత్వాలు రద్దు అయినట్లు ప్రకటించి, ఆ రెండు నియోజకవర్గాలలో ఉపఎన్నికలు నిర్వహించవలసిందిగా కేంద్ర ఎన్నికల కమీషన్ కు లేఖ వ్రాశానని తెలిపారు. శాసనసభ తీసుకొనే నిర్ణయాలను అమలుచేయడమే తప్ప వాటిని ప్రశ్నించే అధికారం తనకు ఉండదని కనుక తాను కోర్టుధిక్కారానికి పాల్పడలేదని తెలిపారు. కాంగ్రెస్‌ నేతలు తమపై కోర్టుధిక్కార నేరానికి వేసిన పిటిషన్లను కొట్టివేయాలని వారిరువురూ అభ్యర్ధించారు. దీనిపై న్యాయస్థానం తీర్పు చెప్పవలసి ఉంది. వారిరువురూ చెప్పిన సంజాయిషీలు సమంజసంగానే ఉన్నప్పటికీ ఇప్పుడు కోర్టు ధిక్కారనేరానికి ఎవరిని ప్రశ్నించాలి..ఎవరిని శిక్షించాలి?అనే సందేహం కలుగక మానదు. 


Related Post