ఉత్తమ్...రేవంత్ ఎవరి మాట నెగ్గుతుంది?

July 27, 2018


img

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరినప్పటికీ తనకు, తన అనుచరులకు పార్టీలో తగిన ప్రాధాన్యం, సముచిత స్థానం ఇవ్వాలని ఆశిస్తున్నారు. వారిని పార్టీలోకి రప్పించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్‌ అధిష్టానానికి ఈ విషయం బాగా తెలుసు. అయితే ఇంతవరకు రేవంత్ రెడ్డికి పార్టీలో కీలకపదవి, బాధ్యతలు ఏవీ అప్పగించలేదు. ఎందుకు? అదివేరే సంగతి. 

తనతోపాటు కాంగ్రెస్‌లో చేరిన తన అనుచరుడు రమేష్ రెడ్డికి సూర్యాపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి షరతు పెట్టారని సమాచారం. అయన గత ఎన్నికలలోనే తెదేపా టికెట్ పై పోటీ చేసి స్వల్పఓట్ల తేడాతో ఓడిపోయారు. కనుక ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలవాలని చాలా పట్టుదలగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం తనకు తప్పకుండా టికెట్ ఇస్తుందనే నమ్మకంతోనే ఉన్నారు. ఆ నమ్మకంతోనే రమేష్ రెడ్డి తన నియోజకవర్గంలో పనిచేసుకుపోతున్నారు. అయితే పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకు పెద్ద షాక్ ఇచ్చారు. 

ఇటీవల సూర్యాపేటలో జరిగిన నిరుద్యోగ ర్యాలీలో అయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి పోటీ చేయబోతున్నారని ఆయనను గెలిపించాలని ప్రకటించేశారు. అదివిని రమేష్ రెడ్డి ఆగ్రహంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇది గమనించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ‘టికెట్స్ సంగతి అధిష్టానం చూసుకొంటుందని’ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ దామోదర్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆలోచిస్తున్నారనే సంగతి అప్రయత్నంగా బయటపడింది. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరిలో ఎవరి మాట నెగ్గుతుంది? వారి అభ్యర్ధులలో ఎవరికి సూర్యాపేట టికెట్ ఇస్తారు?అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మిగిలింది.


Related Post