రేవంత్ రెడ్డికి వేముల వార్నింగ్

July 26, 2018


img

సీనియర్ కాంగ్రెస్‌ నేతలు వి.హనుమంతరావు, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులకు తెరాస నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఈరోజు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ భర్త బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ఎమ్మెల్యే వేముల వీరేశం హస్తం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. శ్రీనివాస్ సంతాపసభలో రేవంత్ రెడ్డి, వి.హనుమంతరావు ఇద్దరూ కూడా తెరాస ఎమ్మెల్యే హస్తం ఉందన్నట్లు మాట్లాడారు. సాక్షి, రాజ్ న్యూస్ మీడియా కూడా వేముల దోషి అన్నట్లుగా వార్తలు ప్రసారం చేశాయి. కనుక వారందరికీ వేముల బుధవారం లాయర్ నోటీసులు పంపించారు. వారం రోజులలోగా అందరూ తనకు బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. 

ఇది తను వ్యక్తిగతంగా తీసుకొన్న నిర్ణయమే తప్ప ఈ కేసుతో తెరాసకు ఎటువంటి సంబంధమూ లేదని వేముల వీరేశం చెప్పారు. రాజకీయంగా తన ఎదుగుదలను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్‌ నేతలు తన గురించి నోటికి వచ్చిన ఆరోపణలు చేశారని వేముల ఆవేదన వ్యక్తం చేశారు. తన సహనాన్ని వారు మెతకదనంగా భావించి అనుచిత విమర్శలు, ఆరోపణలు చేసినందునే ఈవిధంగా స్పందించవలసివస్తోందని వేముల వీరేశం అన్నారు. 

తెరాస ఎమ్మెల్యే పంపిన ఈ నోటీసులకు కాంగ్రెస్‌ నేతలు చాలా ధీటుగానే స్పందించవచ్చు. బొడ్డుపల్లి శ్రీనివాస్ ఈ ఏడాది జనవరి 24వ తేదీ అర్ధరాత్రి హత్య చేయబడ్డారు. ఆ హత్య, కాంగ్రెస్‌ నేతల సంతాపసభ జరిగి ఏడు నెలలయింది. ఇంతకాలం ఊరుకొని ఇప్పుడు కాంగ్రెస్‌ నేతలకు నోటీసులు పంపించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ ఈ కేసులతో కాంగ్రెస్‌ నేతలను అయన ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తే వారే ఆయనను ఇబ్బంది పెట్టవచ్చు. 

నోటీసులు అందుకొన్న కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఆయనపై తీవ్ర విమర్శలు చేయడం ఖాయం. పరువు నష్టం దావా వేస్తే అది ఎన్ని నెలలు నడుస్తుందో దానిలో చివరికి ఎవరు గెలుస్తారో తెలియదు కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న వేములపై కాంగ్రెస్‌ నేతలు చేసే ఆరోపణల వలన అయన పట్ల ప్రజలలో అనుమానాలు, అపోహలు కలిగితే నష్టపోయేది ఆయనే. కనుక కాస్త ఆచితూచి ముందుకు వెళ్ళడం మంచిదేమో! 


Related Post