కెసిఆర్...సుప్రీం తీర్పునైనా గౌరవించు: హనుమంతరావు

July 26, 2018


img

కాంగ్రెస్‌ సీనియర్ నేత వి.హనుమంతరావు నగరంలో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌ను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈరోజు విజ్ఞప్తి చేశారు. డిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చౌక్‌ కొనసాగింపు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో అయన ఈ విజ్ఞప్తి చేశారు. 

డిల్లీ నగరం నడిబొడ్డున గల జంతర్ మంతర్ వద్ద ధర్నా చౌక్‌లో దేశం నలుమూలల నుంచి రోజూ వందలాదిమంది వచ్చి ఏదో ఒక సమస్యపై ధర్నాలు చేస్తూ కేంద్రప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తుంటారు. దాని వలన అక్కడ పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయనే కారణంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయడాన్ని నిషేధించింది. 

ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఒక ప్రజాహిత పిటిషన్ దాఖలైంది. దానిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, “ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి శాంతియుతంగా ధర్నాలు చేసుకొనే హక్కు కలిగి ఉన్నారు. కనుక జంతర్ మంతర్ వద్దే ధర్నా చౌక్ కొనసాగించాలని ఆదేశించింది. అయితే ఆ ప్రాంతం ప్రాముఖ్యతను, పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్నాలు చేయడానికి నిర్దిష్ట సమయాలను, నియమ నిబంధనలు రూపొందించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 

వి.హనుమంతరావు ఆ తీర్పును స్వాగతిస్తూ, దానిని దృష్టిలో ఉంచుకొని ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను కొనసాగించాలని సిఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఉద్యమాకరుడైన సిఎం కెసిఆర్ ధర్నాచౌక్ ను ఎత్తివేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అందుకు ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, అభ్యంతరాలు చెప్పినా, చివరికి గవర్నర్ నరసింహన్ కు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. తన నిర్ణయం మార్చుకోలేదు. కనుక సుప్రీంకోర్టు తీర్పును దృష్టిలో ఉంచుకొని తన నిర్ణయాన్ని మార్చుకొంటారనుకోలేము.


Related Post