నేను రాజకీయ సన్యాసం చేస్తా: రాజగోపాల్ రెడ్డి

July 26, 2018


img

మంత్రి కేటిఆర్ కాంగ్రెస్‌ నేతలకు ఏవిధంగా రాజకీయ సన్యాసం సవాళ్ళు విసురుతున్నారో, కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరులు కూడా అదేస్థాయిలో తెరాసకు సవాళ్ళు విసురుతుండటం విశేషం. ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బుధవారం నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు మీడియాతో మాట్లాడుతూ, “నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటవంటిది. మా కోమటిరెడ్డి సోదరులిద్దరం ఉన్నంత కాలం ఈ కోటలోకి తెరాస అడుగుపెట్టలేదు. స్వయంగా కెసిఆరే వచ్చి ఇక్కడి నుంచి పోటీ చేసినా గెలవలేరు. వచ్చే ఎన్నికలలో నల్గొండ, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గల శాసనసభ స్థానాలను తెరాస గెలుచుకొంటే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. మరి నా ఈ సవాలును స్వీకరించే ధైర్యం తెరాసకు ఉందా?” అని సవాలు విసిరారు. 

ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ పై అనేక విమర్శలు చేశారు. అది వేరే సంగతి. కానీ జిల్లాలో తెరాస గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పడమే ఆలోచింపజేస్తోంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అనేకమంది ప్రముఖ నేతలున్నందున ఆ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటవంటిదేనని చెప్పవచ్చు. అదేవిధంగా కోమటిరెడ్డి సోదరులిరువురికీ జిల్లాలో మంచి బలమున్నమాట కూడా వాస్తవం. అయితే జిల్లాలో బలమైన నేతగా పేరున్న గుత్తా సుఖేందర్ రెడ్డిని తెరాసలోకి ఫిరాయింపజేసి సిఎం కెసిఆర్ కాంగ్రెస్‌ నేతలు పెద్ద షాక్ ఇచ్చిన సంగతిని కూడా విస్మరించలేము. దానితోనే కాంగ్రెస్‌ కంచుకోటను తొలిదెబ్బ తీశారు. 

ఇప్పుడు ఆ కోటలో ఉన్న గుత్తా సుఖేందర్ రెడ్డి చేతులు ముడుచుకొని కూర్చోంటారనుకొంటే అవివేకమే. అయన జిల్లా కాంగ్రెస్ పార్టీలో తనకున్న పరిచయాలు, పరపతిని ఉపయోగించి ద్వితీయశ్రేణి కాంగ్రెస్‌ నేతలను, కార్యకర్తలను తెరాసలోకి రప్పించేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం తధ్యం. అయన తెలంగాణా రైతు సమన్వయ సమితి చైర్మన్ పదవిలో ఉన్నారు కనుక దానిద్వారా జిల్లాలో రైతులందరినీ తెరాసవైపు తిప్పుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేయడం తధ్యం. గుత్తా సుఖేందర్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నాల వలన జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి ఎంత నష్టం జరిగిందనే విషయం ఎన్నికలు దగ్గరపడే సమయానికి బయటపడవచ్చు. కనుక కోమటిరెడ్డి సోదరులు జిల్లాలో తమ అనుచరులు ఎవరూ తెరాసలోకి వెళ్లిపోకుండా కాపాడుకొనేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తే మంచిదేమో?


Related Post