తెరాస ఎంపిలు అందుకే దానికి దూరంగా ఉన్నారుట

July 25, 2018


img

లోక్ సభలో మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో తెరాస ఎంపిలు పాల్గొన్నప్పటికీ, ఓటింగ్ లో పాల్గొనకపోవడంపై కాంగ్రెస్‌ నేతలు తప్పు పడుతున్నారు. అయితే తాము కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలవైపు కానీ, భాజపా దాని మిత్రపక్షాలవైపు గానీ లేమని తెలియజేప్పేందుకే ఓటింగ్ లో పాల్గొనలేదని సిఎం కెసిఆర్ గవర్నర్ నరసింహన్ కు చెప్పినట్లు ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక వార్త ప్రచురించింది. కానీ తమ ఎంపిలు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విభజన చట్టంలో తెలంగాణాకు ఇచ్చిన హామీలను అమలుచేయనందుకు కేంద్రాన్ని గట్టిగా నిలదీశారని కెసిఆర్ చెప్పినట్లు ఆ పత్రిక పేర్కొంది. కెసిఆర్ స్థాపించబోయే ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్‌-భాజపాలకు సమానదూరం పాటిస్తుందని తెలియజెప్పడానికే తెరాస ఎంపిలు ఓటింగుకు దూరంగా ఉన్నారని ఆ వార్త సారాంశం. 

భాజపాకు మిత్రపక్షంగా ఉన్న శివసేన నిత్యం మోడీపై ఎన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అమిత్ షా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చేసరికి అవిశ్వాస తీర్మానం రోజున సభకు డుమ్మాకొట్టి భాజపాకు ఊరట కలిగించింది. అదేవిధంగా ఓడిశాకు చెందిన బిజెడి కూడా సభకు డుమ్మా కొట్టింది. తెరాస కూడా ఓటింగ్ కు డుమ్మా కొట్టి అదే పని చేసింది. తద్వారా ఆ మూడు పార్టీలు తాము భాజపాకు వ్యతిరేకం కాదనే సంకేతం పంపినట్లయింది. మోడీకి కెసిఆర్ అనుకూలం కనుకనే తెరాస ఎంపిలు కూడా ఓటింగులో పాల్గొనలేదని కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. బహుశః వారి విమర్శలకు చెక్ పెట్టేందుకే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తానంటే కాంగ్రెస్‌ నేతలు ఎందుకు సమర్ధిస్తున్నారు? తెలంగాణా కంటే ఏపి, కాంగ్రెస్‌ ప్రయోజనాలే మీకు ముఖ్యమా? అని తెరాస నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు.  

ఒకవేళ కెసిఆర్ కాంగ్రెస్‌, భాజపాలకు సమానదూరం పాటిస్తున్నారనుకొంటే, మరి కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపిన కుమారస్వామికి ఎందుకు మద్దతు పలికినట్లు?అనే సందేహం కలుగకమానదు. కాంగ్రెస్‌, భాజపా, వాటి మిత్రపక్షాలకు తెరాస దూరంగా ఉండదలిస్తే ఇక ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు పార్టీలే కనబడవు. కెసిఆర్ కలిసి వచ్చిన మమతా బెనర్జీ, దేవగౌడలిద్దరూ కాంగ్రెస్‌ పంచనచేరారు. సమాజ్ వాదీ, బహుజన్ సమాజ్ వాదీ తదితర పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకు చేరువవుతున్నాయి. డిఎంకె పార్టీ కూడా కాంగ్రెస్, తెదేపాలతో దోస్తీకి సై అంటోంది. 

ఈవిధంగా తెరాసతో సహా దేశంలో అన్ని పార్టీలు కాంగ్రెస్‌ లేదా భాజపాతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధాలు నెరుపుతూ మడికట్టుకొని కూర్చొన్నామంటే ఎవరు నమ్ముతారు?


Related Post