హోదాపై తెరాస నేతలు కోరస్...ఎందుకో?

July 25, 2018


img

ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ మళ్ళీ నిన్న లోక్ సభలో విస్పష్టంగా ప్రకటించారు. భాజపా ఇవ్వనని ఖరాఖండీగా చెప్పింది కనుకనే కాంగ్రెస్‌ ఇస్తానని చెపుతోందని భావించవచ్చు. అయితే వచ్చే ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్, భాజపాలలో ఏది అధికారంలోకి వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ మళ్ళీ భాజపా వస్తే ఏపికి ప్రత్యేకహోదా రాదు. కాంగ్రెస్‌ వచ్చినా రాదు. ఎందుకంటే, కాంగ్రెస్‌ తనంతట తానుగా మెజారిటీ సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో లేదు. కనుక మోడీని గద్దె దించి అధికారం చేజిక్కించుకోవడం కోసం తమతో కలిసి పనిచేయడానికి అంగీకరించిన ప్రతిపక్షాలకు ప్రధానమంత్రి పదవిని ఇచ్చేసేందుకు రాహుల్ గాంధీ సిద్దమని చెప్పినట్లు తాజా సమాచారం. అదే నిజమనుకొంటే, కాంగ్రెస్‌ పార్టీ తనంతట తానుగా ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వలేదు. 

కర్ణాటకలో కాంగ్రెస్‌-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌ మాట చెల్లడం లేదు. అలాగే ఒకవేళ ఇతరపార్టీల మద్దతుతో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వాటి మాటే చెల్లుతుంది తప్ప కాంగ్రెస్‌ మాట చెల్లదు. అంటే వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలో కాంగ్రెస్‌, భాజపాలలో ఏది అధికారంలోకి వచ్చినా ఏపికి ప్రత్యేకహోదా రాదని స్పష్టం అవుతోంది. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర తెరాస నేతలకు ఈ సంగతి తెలియకనే ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే తెలంగాణాకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారా?అంటే కాదనే అర్ధం అవుతోంది. 

మరి తెలంగాణాకు ప్రత్యేకహోదా ఇవ్వాలని అందరూ కోరస్ ఎందుకు పాడుతున్నట్లు? అంటే ఈ అంశంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టి దానిపై పైచెయ్యి సాధించడానికేనని భావించవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది అదొక్కటే కదా. కనుక ఈ అంశంపై తెరాస నేతల వాదన వారి రాజకీయవ్యూహంలో భాగమేనని అర్ధం అవుతుంది. అయినా హామీ ఇచ్చిన ఏపికే ప్రత్యేకహోదా ఇవ్వబోమని కేంద్రం తెగేసి చెపుతున్నప్పుడు, దేశంలో రెండవ ధనిక రాష్ట్రమైన తెలంగాణాకు ఎందుకు ఇస్తుంది? 


Related Post