తెరాసకు రెడీ మెడ్ ఎమ్మెల్యేలు?

July 25, 2018


img

ఎన్నికలలో ఒక పార్టీ తన అభ్యర్ధిని గెలిపించుకోవాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. ఇక అందరినీ గెలిపించుకొని ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటే ఇంకా కష్టం. అందుకే పొత్తులు కుదరకపోతే ఫిరాయింపులు జరుగుతుంటాయి. గత ఎన్నికల తరువాత తెరాస స్వంత బలంతోనే అధికారంలోకి వచ్చింది. కానీ ఆ తరువాత ఏమి జరిగిందో అందరికీ తెలుసు. 

ఎన్నికలు దగ్గర పడుతున్నందున తెరాస, కాంగ్రెస్‌ పార్టీలతో సహా అన్ని పార్టీలలో టికెట్ల లొల్లి మొదలైపోయింది. అలాగే గెలుపు గుర్రాల అన్వేషణ మొదలైంది. ఆ ప్రయత్నంలోనే కాంగ్రెస్‌ నేత ముఖేష్ గౌడ్ ను తెరాసలో రప్పించేందుకు ప్రయత్నం జరిగింది. కానీ అయన కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెపుతున్నారు. కానీ ఎన్నికల తరువాత కూడా ఉంటారో లేదో తెలియదు.         

కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీనే అంటిపెట్టుకొని స్థిరంగా ఉండే నేతలు పార్టీలో అనేకమంది ఉన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ ఓడిపోయినా వారు నమ్మకంగా పార్టీనే అంటిపెట్టుకొని ఉంటారు. కానీ ఈవిధంగా ఊగిసలాడే నేతలు ఎన్నికల తరువాత తెరాసలోకి జంప్ చేసే అవకాశాలుంటాయి. కనుక కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉండేవారిని గుర్తించి వారికే టికెట్స్ కేటాయించడం చాలా అవసరం. లేకుంటే కాంగ్రెస్‌ కు ఆయాసం తెరాసకు పాయసం దక్కవచ్చు.

ఇక తెరాస విషయానికి పార్టీలో ఉన్నవారికే టికెట్స్ ఇవ్వలేనప్పుడు ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నేతలను పార్టీలోకి రప్పించుకొని వారికి టికెట్లు ఇచ్చి పార్టీలో అసమ్మతి పెంచుకొని బాధలుపడుతూ, తన అభ్యర్ధులను గెలిపించుకోవడానికి ప్రయాసపడాలి. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్నట్లు, 2014 ఎన్నికల తరువాత కాంగ్రెస్‌, తెదేపా, వైకాపాల నుంచి 20 మంది రెడీ-మేడ్ ఎమ్మెల్యేలు లభించారు. కనుక 2019ఎన్నికల తరువాత మళ్ళీ ఇదే ఫార్ములా పాటిస్తే సరిపోతుందేమో? చేతికి మట్టి అంటకుండా పనైపోతుంది కదా!


Related Post