రాహుల్ త్యాగానికి సిద్దమట...నిజామా?

July 25, 2018


img

వచ్చే ఎన్నికలలో మోడీ సర్కార్ ను గద్దె దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ఇటీవల ప్రకటించింది. అయితే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు మేమెందుకు కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని ప్రతిపక్షాలు నేరుగా అడగలేదు కానీ బేషరతుగా మద్దతు ఈయలేమని తేల్చి చెపుతున్నాయి. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానానికి అసలు విషయం అర్ధం అయినట్లుంది. దీనిపై అంతర్గతంగా చర్చించుకొన్న తరువాత మోడీని గద్దె దించేందుకు ‘అవసరమైతే రాహుల్ గాంధీ త్యాగానికి సిద్దం’ అనే కొత్త సంకేతం పంపినట్లు తాజా సమాచారం. కేంద్రంలో అధికారం దక్కించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ‘కర్ణాటక ఫార్ములా’నే అమలుచేయవచ్చని మైతెలంగాణాడాట్.కాం ముందే ఊహించి చెప్పింది. ఇప్పుడు అదే నిజం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తరువాత భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ తన అధికారం నిలబెట్టుకొనేందుకు తనకంటే చాలా తక్కువ సీట్లు వచ్చిన జెడిఎస్ కు ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయడానికి సిద్దం అవుతున్నారని సమాచారం. 

ఒకప్పుడు సోనియా గాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఈ వార్తలు నిజమైతే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా విధిలేని పరిస్థితిలో ‘త్యాగం’ చేయవలసివస్తోంది. కాంగ్రెస్‌ తరపున ఆలోచిస్తే ఇది చాలా మంచి నిర్ణయమేనని చెప్పవచ్చు. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాయావతికి లేదా చాలా అవేశపరురాలైన మమతా బెనర్జీలలో ఎవరో ఒకరికి ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచించడం నిజమైతే, భాజపాకు అదే ఒక వరంగా మారి మళ్ళీ ఎన్నికలలో గెలిచి అధికారం నిలుపుకోగలదు. 

వారిద్దరికీ తమతమ రాష్ట్రాలలో చాలా బలమే ఉండిఉండవచ్చు. కానీ ప్రధానమంత్రి పదవికి వారిలో ఒకరిని అభ్యర్ధులుగా ప్రకటిస్తే దేశప్రజలు ఆమోదించకపోవచ్చు. ఏమైనప్పటికీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని త్యాగం చేయడానికి సిద్దమైతే దేశంలో చాలా పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకవచ్చు. కానీ అప్పుడు ప్రధానమంత్రి పదవికి పోటీపడేవారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ చిక్కుముడిని కాంగ్రెస్‌ అధిష్టానం విప్పగలిగితే దాని ఆశలు ఫలించవచ్చు.


Related Post