ఆ నియమాలు ప్రజాప్రతినిధులకు వర్తించవా?

July 25, 2018


img

రాష్ట్రంలో కొత్తగా నియమింపబడుతున్న 9,200 మంది పంచాయితీ కార్యదర్శులకు వారి మూడేళ్ళ ప్రొబేషనరీ పీరియడ్ లో చేయవలసిన పనుల అజెండాను ముందుగానే ఖరారు చేయాలని సిఎం కెసిఆర్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. వారు ఆ ప్రణాళికకు అనుగుణంగా పనులు చేస్తున్నారా లేదా అని పరిశీలించి, బాగా పనిచేసినవారి ఉద్యోగాలు క్రమబద్దీకరించాలని, పనిచేయనివారిని తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించుకొనే విధంగా విధివిధానాలు రూపొందించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

పంచాయితీలలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఒక్కో జిల్లాకు రూ.30 కోట్లు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తుందని సిఎం కెసిఆర్ చెప్పారు. ఆయా పంచాయితీల అవసరాలు, అక్కడ జరుగుతున్న పనులను బట్టి  ఆ శాఖా ముఖ్య కార్యదర్శి పంచాయితీలకు నిధులు విడుదల చేస్తుంటారని చెప్పారు. ప్రతీ పంచాయితీకి ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక కార్యదర్శిని నియమిస్తామని చెప్పారు. నగరాలు, పట్టణాలతో సమానంగా మారుమూల గ్రామాలు కూడా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని అందుకే ఈ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నామని సిఎం కెసిఆర్ చెప్పారు. కోర్టు తీర్పు రాగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. 

పంచాయితీ కార్యదర్శులకు మూడేళ్ళ ప్రొబేషనరీ పీరియడ్ విధించి, సమర్ధంగా పనిచేయలేనివారిని తొలగించాలనే ఆలోచన మంచిదే. అదే సూత్రం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, ఎంపిలు, మంత్రులకు కూడా వర్తింపజేస్తే బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో కనీసం 30 మంది పనితీరు బాగోలేదని సర్వేలో తేలినట్లు వార్తలు వచ్చాయి. వారి పనితీరు మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికలలో టికెట్స్ ఇవ్వనని సిఎం కెసిఆర్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ మళ్ళీ టికెట్స్ ఇస్తామని సిఎం కెసిఆర్ స్వయంగా ప్రకటించారు. ఎందుకంటే “ఇంతకంటే మంచి ఎమ్మెల్యేలు ఎక్కడా దొరకరు. కావాలంటే ఆకాశం నుంచి దిగిరావాలి” అని సమర్ధించుకొన్నారు.

నెలకు రూ.15,000 జీతం ఇచ్చే పంచాయతీ కార్యదర్శులకు మూడేళ్ళలో ఏవిధంగా పనిచేయాలో ముందే అజెండా నిర్దేశించి, వారి పనితీరు బాగోకపోతే తొలగించాలని నిర్ణయించినప్పుడు, నెలకు లక్షల జీతభత్యాలు, సౌకర్యాలు, అప్పుడప్పుడు ప్రభుత్వం నుంచి నజరానాలు అందుకొంటున్న ప్రజాప్రతినిధులకు ఇదే సూత్రం ఎందుకు వర్తింపజేయడం లేదు?వారి పని తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని తెలిసినా మళ్ళీ వాళ్ళకే టికెట్స్ ఎందుకు ఇవ్వాలనుకొంటున్నారు? 


Related Post