పాక్ ఎన్నికలు మనకీ ముఖ్యమే

July 25, 2018


img

పొరుగుదేశమైన పాకిస్తాన్ లో బుధవారం సార్వత్రిక ఎన్నికలు జరుగబోతున్నాయి. పాక్ ఎన్నికల గోల మనకెందుకు? అని చాలా మంది అనుకోవచ్చు. కానీ అవసరమే. ఎందుకంటే ఆ దేశంలో ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే భారత్ కు పాక్ పక్కలో బల్లెంలా తయారైంది. అదే...ఈ ఎన్నికలలో పోటీ చేస్తున్న ఉగ్రవాదులు అధికారంలోకి వస్తే? లేదా వారు మద్దతు ఇస్తున్న పార్టీ అధికారంలోకి వస్తే...అప్పుడు భారత్ పరిస్థితి ఏమిటి?అని ఆలోచిస్తే పాక్ ఎన్నికలను ఓ లుక్ వేయకతప్పదు. 

పాక్ ఎన్నికల గురించి క్లుప్తంగా చెప్పుకొంటే...

పాక్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంటు)లో 272 సీట్లకు, నాలుగు రాష్ట్రాలలో 577 సీట్లకు నేడు పోలింగ్ జరుగబోతోంది. ఈ ఎన్నికలలో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ (ప్రస్తుతం జైల్లో ఉన్నారు)కు చెందిన పిఎంఎల్-ఎన్, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కు చెందిన పిటిఐ, భుట్టోలకు చెందిన పిపిపి పార్టీల మద్య ప్రధానంగా పోటీ జరుగుతోంది. అయితే అవినీతి ఆరోపణలలో నవాజ్ షరీఫ్ అయన కూతురు, అల్లుడు జైల్లో ఉన్నందున పాక్ ప్రజలు ఇమ్రాన్ ఖాన్ పార్టీవైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తాజా సర్వేలు సూచిస్తున్నాయి. అదేమీ గొప్ప విశేషం కాదు. కానీ అయన పార్టీకి పాక్ సైన్యం, ఉగ్రవాదులు కూడా మద్దతు ఇస్తుండటమే విశేషం. 

ఇక కరడుగట్టిన ఉగ్రవాది, ముంబాయి ప్రేలుళ్ళ సూత్రధారి హఫీజ్ సయీద్ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి ఈ ఎన్నికలలో పోటీ చేయాలనుకొన్నాడు. కానీ ఎన్నికల సంఘం అనుమతించకపోవడంతో అతను తమకు అనుబంధంగా పనిచేస్తున్న వేరేపార్టీ తరపున అభ్యర్ధులను బరిలోకి దింపాడు. ఒకవేళ వారు గెలిచి పాక్ ప్రభుత్వాన్ని చేజిక్కించుకొంటే ఏమవుతుందో తేలికగానే ఊహించవచ్చు. ఇంతవరకు భారత్ పై దొంగచాటుగాయుద్ధం చేస్తున్న ఉగ్రవాదులు ఇకపై ప్రత్యక్షయుద్ధానికే సిద్దపడవచ్చు. 

ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ పార్టీ అధికారంలోకి వచ్చినా పాక్ ప్రభుత్వంపై సైన్యం, ఉగ్రవాదుల ప్రభావం చాలా ఉండవచ్చు. కనుక ఈ ఎన్నికలు పాక్ పార్టీలకు ఎంత కీలకమైనవో భారత్ కు కూడా అంతే ముఖ్యమైనవి. పొరుగింటికి నిప్పు అంటుకొంటే మనకు సంబంధం లేదనుకోలేము కదా? 

తాజా సర్వేల ప్రకారం ఈసారి ఏపార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించదని సమాచారం. పూర్తి మెజారిటీ ఉన్న ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంటేనే పాక్ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. ఇక హంగ్ ఏర్పడితే ఏవిధంగా ఉంటుందో ఊహించుకోలేము. ఈ పరిస్థితులను అవకాశంగా తీసుకొని పాక్ సైన్యం మళ్ళీ ప్రభుత్వాన్ని తన అధీనంలోకి తీసుకొన్నా ఆశ్చర్యం లేదు. 

ఈరోజు సాయంత్రం 6గంటలతో పోలింగ్ ముగుస్తుంది. వెంటనే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఫలితాలు ప్రకటిస్తారు. కనుక రేపటికల్లా పాక్ లో ఏమి జరుగబోతోందో తేలిపోవచ్చు.                      



Related Post