తెరాస మళ్ళీ సెంటిమెంటు రాజేస్తోందా?

July 24, 2018


img

తెరాస రాజకీయంగా ఎంత బలపడినప్పటికీ అవసరమైనప్పుడు తెలంగాణా సెంటిమెంటును రాజేసి ప్రత్యర్ధులపై పైచెయ్యి సాధించాలనుకోవడం దాని బలహీనత అని చెప్పవచ్చు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే ఏపికి తప్పకుండా ప్రత్యేకహోదా మంజూరు చేస్తామని కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ప్రకటించింది. ఈ ప్రకటనను తెరాస అవకాశంగా భావించి మళ్ళీ ఆ సెంటిమెంటు అస్త్రాన్ని బయటకు తీసి టి-కాంగ్రెస్‌ నేతలపై ప్రయోగిస్తోంది. 

మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఏపికి హోదా ఇస్తే అక్కడ పరిశ్రమలకు రాయితీలు అన్నీ లభిస్తాయి కనుక తెలంగాణాకు రావలసిన పరిశ్రమలు, ఇప్పటికే ఉన్న పరిశ్రమలు ఏపికి తరలిపోయే ప్రమాదం ఉంది. కనుక తెలంగాణా రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది. కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ చేసిన ఈ ప్రకటనపై టి-కాంగ్రెస్‌ నేతలు స్పందించాలి. లోక్ సభలో గంటసేపు ప్రసంగం చేసిన రాహుల్ గాంధీ తెలంగాణా గురించి ఒక్క ముక్క మాట్లాడలేదు. తెలంగాణాపట్ల కాంగ్రెస్‌ అధిష్టానానికి శ్రద్ధలేదని వర్కింగ్ కమిటీ ప్రకటనతో తేలిపోయింది. ప్రస్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఏపిలో మళ్ళీ బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బహుశః అందుకే తెలంగాణాను బలిచేసి ఏపిలో కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ జీవంపోయాలని ఆలోచిస్తున్నట్లుంది. కనుక టి-కాంగ్రెస్‌ నేతలు తాము తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలను కోరుకొంటున్నారో లేక తమ పార్టీ ప్రయోజనాల కోసం ఏపికి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుకొంటారో చెప్పాలి,” అని అన్నారు. 

ఏపికి ప్రత్యేకహోదా అంశం ఇప్పటిదికాదని మంత్రి హరీష్ రావుకు కూడా తెలుసు. రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడే ఆ హామీ ఇవ్వడం జరిగింది. దానికి కెసిఆరే సాక్ష్యం. ఏపికి ప్రత్యేకహోదా ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని సుమారు రెండేళ్ళ క్రితం సిఎం కెసిఆర్ అన్నారు. కానీ ఇప్పుడు తెరాస మంత్రులు అభ్యంతరం చెపుతున్నారు. 

అయితే ఏపికి ఎట్టిపరిస్థితులలో ప్రత్యేకహోదా రాదనే సంగతి దాని కోసం ఉద్యమాలు చేస్తున్న ఏపిలోని పార్టీలన్నిటికీ బాగా తెలుసు. ఈ సంగతి తెరాసకు కూడా బాగా తెలుసు. అందుకే గత నాలుగేళ్ళుగా ప్రత్యేకహోదా కోసం ఎన్ని ఉద్యమాలు జరుగుతున్న తెరాస పెద్దగా పట్టించుకోలేదు. 

వచ్చే ఎన్నికలలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు. వచ్చిన అది ఆ హామీని నిలబెట్టుకొంటుందనే నమ్మకం లేదు. మరి రాని ప్రత్యేకహోదా గురించి తెరాస ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తోంది? అంటే తెలంగాణా సెంటిమెంటుతో కాంగ్రెస్‌ నేతలపై పైచెయ్యి సాధించడానికేనని భావించవచ్చు. అయితే తెరాస సంధించిన ఈ అస్త్రాన్ని టి-కాంగ్రెస్‌ నేతలు ఎంతవరకు ఎదుర్కోగలరో చూడాలి.


Related Post