టిజెఎస్ వ్యూహం ఏమిటో?

July 24, 2018


img

తెలంగాణా జనసమితి (టిజెఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంకు తెరాస, భాజపా, మజ్లీస్ పార్టీలతో తప్ప రాష్ట్రంలో మిగిలిన అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలున్నాయనే సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రజాసమస్యలపై పోరాటాలు చేయడం వలన ఆ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. కనుక వచ్చే ఎన్నికలలో వాటిలో ఏదో ఒక పార్టీతో పొత్తులు పెట్టుకొని పోటీ చేస్తారని భావించడం సహజం. కానీ అయన ఏ పార్టీతో, కూటమితో పొత్తులు పెట్టుకోవడానికి విముఖత చూపుతున్నారు. 

తమ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిఎల్ఎఫ్ నేతలు కోరినా ఆయన సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ప్రతిపక్షాలన్నిటి లక్ష్యం తెరాస సర్కార్ ను గద్దె దించడమే అయినప్పుడు అందరూ కలిసి పనిచేయాలని అలాకాక ఎవరికివారు పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి మళ్ళీ తెరాసయే లాభపడుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయినా ప్రొఫెసర్ కోదండరాం తన మనసు మార్చుకోలేదు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన రైతు దీక్షా శిబిరంలో పాల్గొన్నప్పుడు అయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని మళ్ళీ నొక్కి చెప్పారు. 

వచ్చే ఎన్నికలలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌-తెరాసల మధ్యే ఉండబోతోందని స్పష్టంగా కనిపిస్తోంది. వాటి మద్య తెదేపా, భాజపాలు సైతం నిలబడలేని పరిస్థితి కనిపిస్తోంది. మరి కొత్తగా స్థాపించిన తెలంగాణా జనసమితి ఏవిధంగా విజయం సాధించగలదని ప్రొఫెసర్ కోదండరాం భావిస్తున్నారో అర్ధం కాదు. తొలి ప్రయత్నంలో గెలవలేకపోయినా ఎన్నో కొన్ని సీట్లు సాధించుకొని శాసనసభలో అడుగుపెడితే చాలని భావిస్తున్నారో లేదా కాంగ్రెస్‌, తెరాసల మద్య పోటీ తీవ్రంగా ఉంటుంది కనుక కొన్ని సీట్లు గెలుచుకోగలిగితే రాష్ట్ర రాజకీయాలలో నిర్ణయాత్మకశక్తిగా ఎదగవచ్చని భావిస్తున్నారేమో? 

ఒకవేళ అదే ఉద్దేశ్యం ఉన్నట్లయితే బిఎల్ఎఫ్ తోనైనా చేతులు కలిపి టిజెఎస్ విజయావకాశాలు మెరుగుపరుగుచుకోవచ్చు. కానీ దానికీ విముఖత చూపిస్తున్నారు. కనుక వచ్చే ఎన్నికలలో ఏదో అద్భుతం జరిగి తెలంగాణా జనసమితి గెలుస్తుందని లేదా తప్పకుండా గెలిచి తీరుతామనే ఆత్మవిశ్వాసంతో ప్రొఫెసర్ కోదండరాం ఒంటరి పోరాటానికి సిద్దపడుతున్నారనుకోవలసి ఉంటుంది. అయినా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కనుక ఆలోగా పొత్తుల విషయంపై పునరాలోచన చేసినా చేయవచ్చు.


Related Post