తెలంగాణాలో కాంగ్రెస్‌కు విజయావకాశాలు

July 23, 2018


img

తెలంగాణా రాష్ట్రంపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సుమారు నెలరోజుల క్రితం రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు ముగ్గురు ఏఐసిసి కార్యదర్శులను నియమించారు. వారు నెలరోజులు తెలంగాణాలో పర్యటించి నేతలను, కార్యకర్తలను అందరినీ కలుసుకొని పార్టీ పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. సోమవారం వారితో రాహుల్ గాంధీ సమావేశమైనప్పుడు తెలంగాణా పరిస్థితిని ఆయనకు వివరించారు.

వచ్చే ఎన్నికలలో తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేందుకు మంచి అవకాశాలున్నాయని వారు రాహుల్ గాంధీకి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పటికీ తెరాస పట్ల, ముఖ్యంగా దాని ఎమ్మెల్యేల పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. కెసిఆర్ నిరంకుశ, కుటుంబ పాలన, నిరుద్యోగ సమస్య, హామీల అమలులో వైఫల్యం వంటి కారణాల చేత తెరాసపట్ల ప్రజల్లో వ్యతిరేకత నెలకొని ఉందని వారు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్ధులను పోటీకి దించినట్లయితే వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో విజయం సాధించడం ఖాయమని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి పట్టణాలలో కంటే పల్లెలలోనే ఎక్కువ ఆదరణ కనిపిస్తోందని తెలిపారు.

వచ్చే ఎన్నికలలో తెరాస 100కు పైగా సీట్లు గెలుచుకొని మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయమని, లేకుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని మంత్రి కేటిఆర్ పదేపదే ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాలు విసురుతుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మంచి విజయావకాశాలున్నాయని ఏఐసిసి కార్యదర్శులు రాహుల్ గాంధీకి చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని సీట్లు గెలవగలదో చెప్పాలని మంత్రి కేటిఆర్ విసురుతున్న సవాలుకు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఎవరూ గట్టిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. పైగా ‘మీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరు?’ అనే కేటిఆర్ ప్రశ్నకు టి-కాంగ్రెస్‌ నేతలు సమాధానం చెప్పలేకపోతున్నారు. అలాగే పార్టీలో నేతల మధ్య అప్పుడే టికెట్ల కోసం కీచులాటలు మొదలైపోయాయి. అవి కూడా పార్టీకి నష్టం కలిగించేవిగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఏవిధంగా భరోసా ఇచ్చారో? వారికే తెలియాలి.                          


Related Post