కిషన్ రెడ్డి లోక్ సభకు పోటీ చేయబోతున్నారా?

July 23, 2018


img

భాజపాకు దక్షిణాదిన బలమున్న రాష్ట్రాలలో కర్ణాటక తరువాత తెలంగాణా నిలుస్తుంది. కనుక తెలంగాణా ఏర్పడిన తరువాత భాజపా మరింత బలపడి రాష్ట్రంలో అధికారం సాధించే దిశలో సాగాలి కానీ దానికి బాగా పట్టున గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలోనే తెరాస చేతిలో ఘోరంగా ఓడిపోయింది. అదొక్కటే కాదు..2014 తరువాత రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలలో కూడా గెలవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో అది 2019లో ఇదివరకు గెలుచుకొన్న స్థానాలనైనా తిరిగి గెలుచుకోగలదా?అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఇప్పుడు దేశంలో నరేంద్ర మోడీకి కొంత ఎదురుగాలి వీస్తోంది. కారణాలు అందరికీ తెలిసినవే. ఈ అవకాశాన్ని వినియోగించుకొని వచ్చే ఎన్నికలలో గెలిచి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. జాతీయస్థాయిలో భాజపాను వ్యతిరేకిస్తున్న పార్టీలను అన్నిటినీ కలుపుకుపోతోంది. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు భాజపాకు గట్టి పోటీనీయబోతున్నాయి. మోడీని గద్దె దించడమే తన లక్ష్యమని కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ నిన్ననే ప్రకటించింది. కనుక భాజపా కూడా అందుకు అనుగుణంగా తన వ్యూహాలు రూపొందించుకోక తప్పదు. 

తెలంగాణాలో భాజపా పరిస్థితి, జాతీయ అవసరాలు దృష్టిలో ఉంచుకొని భాజపాకు బలమున్న చోట ఎంపిలను గెలిపించుకోవాలని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో  వీలైనన్ని ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలుచుకొనేందుకు వ్యూహాలు సిద్దం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. 

బహుశః ఆ వ్యూహంలో భాగంగానే భాజపా ఎమ్మెల్యే కిషన్ రెడ్డి వచ్చే ఎన్నికలలో శాసనసభకు బదులు లోక్ సభకు పోటీ చేయడానికి సిద్దం అవుతున్నారని తాజా సమాచారం. అయన మల్కాజ్ గిరీ లేదా సికింద్రాబాద్ నియోజకవర్గాలలో ఏదో ఒక చోట నుంచి లోక్ సభకు పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నారని తాజా సమాచారం. 

ఒకవేళ అయన మళ్ళీ శాసనసభకు పోటీ చేసి గెలిచినా ప్రతిపక్ష బెంచీలలోనే కూర్చొని తెరాస మంత్రులు చేసే ప్రసంగాలు వింటూ కాలక్షేపం చేయాల్సి ఉంటుంది. అదే...లోక్ సభకు పోటీ చేసి గెలిచినట్లయితే కేంద్రంలో మళ్ళీ భాజపా ప్రభుత్వ ఏర్పాటుకు తోడ్పడుతుంది ఎంపిగా ఎన్నికైతే కేంద్రమంత్రి పదవి లభించే అవకాశం కూడా ఉంటుంది. అంటే స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా పూర్తవుతుందన్నమాట! లోక్ సభకు పోటీ చేయడం గురించి వచ్చిన ఈ వార్తపై కిషన్ రెడ్డి త్వరలోనే స్పష్టత ఈస్తారేమో చూడాలి.


Related Post