రాహుల్‌ను ప్రధాని చేయాలట!

July 23, 2018


img

రాజకీయనాయకులు అందరూ పదవులు, అధికారం కోసమే రాజకీయాలలోకి వస్తారని అందరికీ తెలుసు కానీ మాంసం తింటామని ఎముకలను మెళ్ళో వేసుకొని తిరగనట్లే, వాళ్ళు కూడా తాము వాటి కోసం కాక ప్రజాసేవ చేయడంకోసమే వచ్చామని చెప్పుకొంటుంటారు. కానీ ఇది ఒకప్పటి మాట! ఇప్పుడు మొహమాటాల్లేవ్...డొంక తిరుగుడు మాటలు అసలే లేవ్...అన్నీ డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. 

కొందరు ఎప్పటికీ మేమే అధికారంలో ఉండాలని కొరుకొంటున్నామని చెపుతున్నారు. ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడమే తమ లక్ష్యమని అన్ని పార్టీలు కుండబద్దలు కొట్టినట్లు చెపుతున్నాయి. టికెట్లు, పదవులు అన్నీ తమ పిల్లలకే దక్కాలని లేదా తమ జాతికి అన్యాయం చేసినట్లేనని మరికొందరు బడానేతలు వాదిస్తుంటారు. అందరి లక్ష్యం ఒకటే..పదవులు...అధికారం! తాము తప్ప వేరెవరు అధికారంలో ఉన్నా వచ్చినా దేశం సర్వనాశనం అయిపోవడం ఖాయమని గట్టిగా వాదిస్తుంటారు. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత విధాన నిర్ణయకమిటీ అయిన కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటీ ఆదివారం డిల్లీలో సమావేశమయ్యింది. ఆ సమావేశం సారాంశం ఏమిటంటే, ‘మోడీని గద్దె దించి ఆ కుర్చీలో రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలని.’ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశం మళ్ళీ గాడిన పడుతుందని ఏకగ్రీవంగా తీర్మానించి ఆమోదించేశారు. అందుకోసం దేశంలో ఏ పార్టీలతో ఎన్నికలకు ముందు, తరువాత పొత్తులు పెట్టుకొవాలో సమావేశంలో చర్చించారు. షరా మామూలుగా ఆ బాధ్యతను రాహుల్ గాంధీకె అప్పగిస్తూ తీర్మానం ఆమోదించారు. 

కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకొంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయనను ప్రధానమంత్రిని చేయడానికి దేశంలో అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలి? అయన కంటే ఎక్కువ రాజకీయ, పరిపాలనానుభవం ఉన్నవారు కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని పార్టీలలో కూడా ఉన్నారు కదా? వారిని కాదని ఎన్నడూ కనీసం మంత్రిగా కూడా పనిచేయని రాహుల్ గాంధీ చేతిలో దేశాన్ని ఎందుకు పెట్టాలి?ప్రధానమంత్రి కావడానికి మిగిలినవారికంటే రాహుల్ గాంధీకి ఉన్న అదనపు అర్హత ఏమిటి? అయినా పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని విధాల భ్రష్టు పట్టిపోయిందనే కదా 2014 ఎన్నికలలో దేశప్రజలు ఆ పార్టీని గద్దె దించారు. మరి మళ్ళీ దానిని ఎందుకు గద్దెనెక్కించాలి అనే ప్రశ్నలకు రాహుల్ గాంధీ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పగలరా? 


Related Post