అది ప్రేమను చాటే హగ్: ఉత్తమ్ కుమార్ రెడ్డి

July 21, 2018


img

ప్రధాని నరేంద్రమోడీపై తీవ్ర విమర్శలు చేసిన తరువాత రాహుల్ గాంధీ ఆయనను కౌగలించుకోవడంపై దేశమంతటా జోకులు పేలుతుంటే కాంగ్రెస్‌ నేతలు జవాబు చెప్పలేక చాలా ఇబ్బందిపడుతున్నారు. అయితే అధినేత ఏమి చేసినా గట్టిగా సమర్ధించుకోక తప్పదు కనుక టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అది ప్రేమను చాటుకొనేందుకు ఇచ్చిన హగ్ అని చెప్పుకొన్నారు. మోడీ, అమిత్ షాలు దేశంలో విద్వేషం, పరమత అసహనం పెంచుతూ ప్రజల మద్య చిచ్చుపెడుతుంటే కాంగ్రెస్ పార్టీ అందరినీ సమానంగా ప్రేమను పంచి ఇస్తుందని, చివరికి తనను ద్వేషించేవారికి సైతం ప్రేమను పంచి ఇవ్వగలదని చాటి చెప్పుకోనేందుకే రాహుల్ గాంధీ మోడీని కౌగలించుకొన్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

అది నిజమే కావచ్చు. రాహుల్ గాంధీ చేసిన ఈ చిలిపిపని కారణంగా అయన వ్యక్తిత్వంపై అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ గాంధీకి వయసు పెరిగినప్పటికీ ఇంకా పిల్ల చేష్టలు పోలేదని భాజపా నేతలు ఎద్దేవా చేస్తున్నారు. లోక్ సభలో స్క్రిప్ట్ లేనిదే అయన మాట్లాడలేరనే భాజపా నేతల విమర్శలకు సమాధానంగా రాహుల్ గాంధీ చాలా అనర్ఘళంగా మాట్లాడి అందరినీ ఆకట్టుకొన్నారు. కానీ చివరికి చేసిన ఆ చిన్న చిలిపి పనితో అందరూ అయన ఏమి మాట్లాడారో మరిచిపోయి కౌగిలింత, సభలో కన్ను కొట్టడం గురించే మాట్లాడుకొంటున్నారు. ఇది స్వయంకృతాపరాధమే కదా!

 రాహుల్ గాంధీ ఇదివరకు లోక్ సభ వెనుక బెంచీలలో నిద్రపోతూ కెమెరాలకు చిక్కారు. ఆ తరువాత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు చెప్పాపెట్టకుండా రెండున్నర నెలలపాటు విదేశాలకు వెళ్ళిపోయి పత్తాలేకుండా మాయం అయిపోయారు. అప్పుడు అయన బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శలు వినిపించాయి. 

నిన్న లోక్ సభలో ప్రసంగిస్తున్నప్పుడు “నన్ను ఎవరైనా ‘పప్పు’ (మొద్దబ్బాయి) అన్నా కూడా బాధపడను” అని చెప్పడం ద్వారా తనపై ప్రజలకు గొప్ప అభిప్రాయం లేదనే సంగతి తనకు కూడా తెలుసునని స్వయంగా చాటుకొన్నారు. తద్వారా రాహుల్ గాంధీ తన స్థాయిని తనే మరింత తగ్గించుకొన్నట్లయింది. 

మోడీని గంటసేపు తిట్టిపోసిన తరువాత వెళ్ళి ఆయనను కౌగలించుకోవడంతో రాహుల్ గాంధీ నవ్వులపాలయ్యారు. తన పార్టీని కూడా నవ్వులపాలు చేశారు. కానీ కాంగ్రెస్‌ నేతలు తమ అధినేతను సమర్ధించుకోక తప్పదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే చేశారని చెప్పవచ్చు.


Related Post