మల్టీప్లెక్స్ దోపిడీకి అకున్ అడ్డుకట్ట

July 21, 2018


img

ఈరోజుల్లో మామూలు థియేటర్లలోనే కుటుంబ సమేతంగా సినిమా చూడటం చాలా ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇక మల్టీప్లెక్స్‌ థియేటర్లలో చెప్పనక్కరలేదు. టికెట్ ధరలతో పాటు సినిమా థియేటర్లలో విక్రయించే తినుబండారాలు, కూల్ డ్రింక్స్, చివరికి వాటర్ బాటిల్స్ వరకు అన్నిటి ధరలు ఫైవ్ స్టార్ హోటల్ ధరలను తలపిస్తుంటాయి. అందుకే మధ్యతరగతి ప్రజలు మల్టీప్లెక్స్ లో సినిమాలంటే భయపడుతుంటారు. 

ఇంతకుముందు ఎక్సైజ్ శాఖలో మాదకద్రవ్యాల కేసులలో సినీ ప్రముఖుల వ్యవహారాలు వెలికితీసి సంచలనం సృష్టించిన అకున్ సభర్వాల్ తూనికలు, కొలతలు, పౌరసరఫరా శాఖలకు బదిలీపై వచ్చిన తరువాత ఈ మల్టీప్లెక్స్ దోపిడీపై దృష్టి సారించారు. 

నగరంలో సాధారణ, మల్టీప్లెక్స్ థియేటర్ల యజమానులతో జూలై 17వ తేదీన సమావేశం నిర్వహించి, ఇక నుంచి ఈ పద్దతులు మార్చుకోవాలని లేకుంటే చట్టప్రకారం చర్యలు తప్పవని సున్నితంగా హెచ్చరించారు. ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో గల సినిమా థియేటర్ల యజమానులతో జూలై 23, 24 తేదీలలో సమావేశాలు నిర్వహించి ఈ అంశంపై మాట్లాడాలని అకున్ సభర్వాల్ అన్ని జిల్లాల తూనికలు, కొలతలు శాఖ అధికారులు, ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. 

థియేటర్ల యజమానుల సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకొన్న అకున్ సభర్వాల్, వారికి రెండు నెలలు గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఖచ్చితంగా ఈ నిబంధనలను అమలుచేయాలని ఆదేశించారు.

1. థియేటర్లలో విక్రయించే అన్ని రకాల ఆహార పదార్ధాల ప్యాకెట్స్ (చిప్స్, బిస్కట్స్, చాక్లేట్స్ వగైరా) ఎం.ఆర్.పి. ధరను సూచిస్తూ స్టిక్కర్ ఉండాలి. ఆ పదార్ధాలను అదే ధరకు విక్రయించాలి.

2. థియేటర్లలో ఏదో ఒక ఖరీదైన బ్రాండ్ కాకుండా అన్ని రకాల వాటర్ బాటిల్స్ విక్రయించాలి.

3. ఆగస్ట్ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాలలో అధికారులు థియేటర్లలో తనికీలు నిర్వహిస్తుండాలి. 

4. థియేటర్లలో ఆహారపదార్ధాలను అధిక ధరలకు విక్రయించినా లేదా మోసాలకు పాల్పడినా కటిన చర్యలు తప్పవు. అన్ని థియేటర్లలో కొలతలు తూనికల శాఖా టోల్ ఫ్రీ నెంబర్: 1800 42500 333 మరియు వాట్సాప్‌ నెం. 73307 74444 లను ప్రేక్షకులకు కనబడేవిధంగా అమర్చాలి.


Related Post