వచ్చే ఎన్నికలు వాళ్ళకీ అగ్నిపరీక్ష వంటివే

July 21, 2018


img

ఏపిలో తెదేపా, వైకాపాల మద్య గత పదేళ్ళుగా ఆధిపత్యపోరు సాగుతోంది. ఆ పోరులో భాగంగానే రెండు పార్టీలు ఒకదానిని మరొకటి రాజకీయంగా చావుదెబ్బ తీసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిలో భాగంగానే వైకాపా ఎంపిలు రాజీనామాలు చేశారు. 

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నుంచి తప్పించుకొనేందుకే వారిచేత జగన్ ముందుగా రాజీనామాలు చేయించారని తెదేపా వాదిస్తోంది. తాము పార్లమెంటులోనె మోడీని ధైర్యంగా నిలదీస్తుంటే, వైకాపా ఎంపిలు ముందే రాజీనామాలు చేసి చర్చలో పాల్గొనకుండా పిరికిపందల్లా తప్పించుకొని పారిపోయారని ఆరోపించారు.    

రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఎంపిల చేత రాజీనామాలు చేయించానని కానీ చంద్రబాబు నాయుడు మాత్రం ఇంకా కేంద్రంతో అంటకాగేందుకే తన ఎంపిల చేత రాజీనామాలు చేయించడం లేదని జగన్మోహన్ రెడ్డి వాదిస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ పదవులు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని జగన్ వాదిస్తున్నారు. దమ్ముంటే వారి చేత రాజీనామాలు చేయించాలని జగన్ ఇవాళ్ళ బాబుకు సవాల్ విసిరారు. 

ఈ అవిశ్వాస తీర్మానం, రాజీనామాలు, సవాళ్ళు అన్నీ తమ రాజకీయ ప్రత్యర్ధులను చిత్తు చేసి వారిపై పైచెయ్యి సాధించడానికే పనికివస్తాయి తప్ప కేంద్రం నుంచి ఒక్క దమ్మిడీ తేలేవు. వచ్చే ఎన్నికలలో ఏపి ప్రజలు ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. కనుక వచ్చే ఎన్నికలు తెదేపా, వైకాపాలకే కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల విజ్ఞతకు కూడా పరీక్ష వంటివేనని చెప్పవచ్చు. మరి వారు ఎవరిని గెలిపిస్తారో చూడాలి. 


Related Post